బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అంటవ్.. పక్కన కాంగ్రెస్ అభ్యర్
జగిత్యాల: ‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని అంటున్నవ్.. పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎందుకు కూర్చోబెట్టుకున్నవ్.. దమ్ముంటే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించు..’ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఉద్దేశించి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి చూస్తుంటే జాలేస్తోందని, ఒకరోజు కాంగ్రెస్ పార్టీ అని, మరోరోజు బీఆర్‌ఎస్ పార్టీ అని చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు పొందిన అభ్యర్థులను వెంటపెట్టుకునే దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. ఓ వైపు ప్రజలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు తిట్లపురాణం వింటుంటే తామే వినలేకపోతున్నామని ఎద్దేవా చేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అంటే బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి రావాలిగానీ.. కాంగ్రెస్ ఫ్లెక్సీ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, జిల్లాకేంద్రంగా చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, కార్యదర్శి ఆనందరావు పాల్గొన్నారు.


