గుల్లపేటలో అద్దె భవనంలో ప్రమాణస్వీకారం
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం గుల్లపేటలో గ్రామపంచాయతీ భవనాన్ని రెండేళ్ల క్రితం శిథిలావస్థలో ఉండటంతో కూల్చివేశారు. అప్పటి నుంచి అద్దె భవనంలోనే కొనసాగుతోంది. చెర్లపల్లి గ్రామ పంచాయతీకి కూడా భవనం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలోనే ఏడేళ్లుగా కార్యాలయం నిర్వహిస్తున్నారు. రెండు గ్రామాల్లో సోమవారం పాలకవర్గాలు అద్దె భవనంలోనే ప్రమాణస్వీకారం చేశారు.
దాడిచేసిన వ్యక్తులపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌కు చెందిన సంపంగి సతీశ్‌పై దాడిచేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. టీఆర్‌నగర్‌కు చెందిన సంపంగి సతీశ్ ఇంటిపై ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మద్యంమత్తులో ఫిరోజ్, కోటగిరి సుమన్, కొండ నాగేంద్ర, దాగిమల్ల రమేశ్ నానాబూతులు తిట్టి రాళ్లతో కొట్టారు. అడ్డువచ్చిన సతీశ్ తల్లి లక్ష్మీపై కూడా దాడిచేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.


