గెలుపు సంతోషం.. అప్పుల భయం
జగిత్యాల: పంచాయతీ పోరు ముగిసింది. జిల్లాలోని 385 సర్పంచ్, 3,536 వార్డు స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. త్వరలోనే పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో మేజర్ గ్రామపంచాయతీల్లో ఏకంగా రూ.50 నుంచి రూ.90 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ప్రతి గ్రామంలో రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చు పెట్టారంటే అతియోశక్తి కాదు. గెలుపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లకు అనేక హామీలు ఇచ్చారు. కొందరు ఏకంగా బాండ్ పేపర్లు రాసిచ్చిన సంఘటనలున్నాయి. ప్రస్తుతం గెలిచిన సర్పంచులకు పదవి సవాల్‌గానే ఉండనుంది. గత పాలకవర్గం ముగిసి.. రెండేళ్లపాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొనసాగాయి. అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య, గ్రామపంచాయతీ నిర్వహణ, పాఠశాలల సమస్యలు, పారిశుధ్యం, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. గతంలోనే నిధులు లేక కొందరు సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. సర్పంచ్ హోదా అనేది ఒక స్టేటస్‌గా ఉండటంతో పోటీ చేసిన అభ్యర్థులు లక్షల్లో ఖర్చు పెట్టారు. ఐదేళ్లలో ఒక చిన్న గ్రామానికి కూడా కనీసం అంత రెవెన్యూ రాదు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లారే తప్ప అసలు ఆ గ్రామం రెవెన్యూ ఎంత..? ఎలా పనులు చేయిస్తాం..? అన్నది ఆలోచించకుండానే రూ.కోట్లు కుమ్మరించారు. గెలిచిన సర్పంచులు ముందున్న సమస్యను ఎలా పరిష్కరిస్తారో..? ఈ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారో..? చూడాల్సిందే. గతంలో రిజర్వేషన్ అనుకూలించే వారు భార్యలను నిలబెట్టి గెలిపించుకున్నారు. 385 గ్రామాల్లో ఒక గ్రామానికి ఒక అభ్యర్థి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేసుకున్నా రూ.3 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుంది. ఒక్కో గ్రామంలో ఐదారుగురు అభ్యర్థులు నిల్చున్నారు. కొన్ని చోట్ల అత్యధికంగా ఖర్చు చేశారు.
అభివృద్ధి మాట దేవుడెరుగు...
ప్రతి సర్పంచ్ అభ్యర్థి లక్షల్లో ఖర్చు పెట్టుకోవడంతో అభివృద్ధి కన్నా ముందు ఆ డబ్బులు ఎలా వస్తాయన్నది ఆలోచిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ఖర్చు చేసి ఓడిపోయిన అభ్యర్థులేమో ఆందోళనలో ఉండగా.. గెలిచిన అభ్యర్థులు లోలోన సంతోషంగా లేరు. సర్పంచ్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకోగా.. మరికొందరు భూములు, ఇతర ఆస్తులను అమ్ముకున్నారు.
అప్పుల భయం
చాలామంది అభ్యర్థులు ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఓటర్లకు పంచిపెట్టి గెలుపొందారు. ఇంకొందరు ఓడిపోయారు. ఆ అప్పులన్నీ మీద పడటంతో ఎలా కట్టాలన్నదానిపై ఆందోళన చెందుతున్నారు. గెలిచిన వారంతా కొద్దిమేర సంతోషంగా ఉన్నప్పటికీ ఎలా అప్పులు కట్టాలన్నదానిపై ఆందోళన చెందుతున్నారు. గెలిచిన వారికి హామీలు నెరవేర్చడంతో పాటు, అటు అప్పులు కట్టాల్సిన బాధ్యత ఉంటుంది.


