పునాదులు దాటని గ్రంథాలయ భవనం
రాయికల్: రాయికల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో టీయూఎఫ్‌ఐడీసీ నిధుల ద్వారా రూ.32 లక్షల వ్యయంతో చేపడుతున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పునాదులు కూడా దాటడం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేయకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి. రాయికల్‌పట్టణంతోపాటు.. మండలంలోని 32 గ్రామాలకు చెందిన యువత పుస్తక పఠనం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రంథాలయాలు ఎంతో తోడ్పడుతాయి. అయితే పట్టణంలోని గ్రంథాలయంలో సరైన వసతులు లేకపోవడంతో ఇక్కడకు రావాలంటేనే నిరుద్యోగులు, యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
నత్తనడకన సాగుతున్న పనులు
గ్రంథాలయం నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 26 రూ.32 లక్షల వ్యయంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ భూమిపూజ చేశారు. నాటి నుంచి నేటి వరకు గ్రంథాలయ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేయకపోవడంతో దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ పునాదులకే పరిమితవుతోంది. కేవలం ఆరునెలల్లో గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా పూర్తి కాకపోవడంతో పాఠకులు అద్దె గదుల్లో ఉంటున్న గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు, దినపత్రిక పఠనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు కావాల్సిన మెటిరియల్స్ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికై నా గ్రంథాలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి నిరుద్యోగులకు, పాఠకులకు నూతన భవనంలో మౌళిక వసతులు కల్పించాలని పాఠకులు కోరుతున్నారు.


