గ్రామాలను అభివృద్ధి చేయండి
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్/రాయికల్: కొత్తగా గెలిచిన సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలంలోని తక్కళ్లపల్లి సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, పథకాల అమలుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లచ్చన్న, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు
రాయికల్ మండల బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు స్పందన, అల్లీపూర్ మాజీ ఉపసర్పంచ్ సాగర్‌రావు బుధవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వారి వెంట మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ముఖీద్ ఉన్నారు.
పెన్షనర్లకు సత్వర సేవలు
జగిత్యాల: పెన్షనర్లకు సత్వర సేవలందిస్తామని అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్.మధు అన్నారు. బుధవారం కార్యాలయంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. పెన్షనర్లు సమస్యలుంటే తన దృష్టికి తీసుకుస్తే పరిష్కరిస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, పెన్షనర్స్ బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని కోరారు.


