డబ్బులు పాయే.. ఓట్లూ రాకపాయే..
రాయికల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలడంతో సర్పంచ్ పీఠం దక్కించుకున్న నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. రాయికల్ మండలంలోని మేజర్ గ్రామమైన అల్లీపూర్‌లో కేవలం నలుగురు అభ్యర్థులు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని మరికొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఖర్చు చేశారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టారు. తీరా ఓటమి పాలైన అభ్యర్థులు తాము ఎన్నికల్లో పెట్టిన ఖర్చును ఏ విధంగా భర్తీ చేయాలని అంతర్మథనం పడుతున్నారు. తమ లెక్కలు తలకిందులు కావడంతో కొన్ని గ్రామాల్లోని కులాలకు చెందిన సంబంధించిన ఓట్లు రాకపోవడంతో బూతుపురాణం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


