‘మూడో విడత’ ప్రలోభాలు
కుల, మహిళా సంఘాలకు పంపిణీకి సిద్ధం ఒక్కరోజులోనే చక్రం తిప్పుతున్న అభ్యర్థులు మూడో విడత అభ్యర్థులకు పెరిగిన ఖర్చు
జగిత్యాల: మూడో విడత ప్రచారానికి జిల్లాలో గడువు ముగిసింది. దీంతో ప్రలోభాల పర్వం మొదలైంది. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలతో పోల్చితే మూడో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. చివరి రోజు ప్రతి ఒక్క అభ్యర్థి డబ్బు, మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మొదటి, రెండోవిడతల్లో ఓడిపోయిన, గెలుపొందిన అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? ఎలా అయితే గెలుస్తాం..? అని వారి అనుభవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఒక్కో ఇంటికి తిరుగుతూ ప్రతిసారి గుర్తులను గుర్తుచేస్తూ.. తమను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. సమయం అధికంగా ఉండటంతో వీరు చాలాసార్లు ఓటర్లను కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కుల సంఘాలు, మహిళ సంఘాలను కలిసి ఓట్లు వేయాలని కోరడంతో పాటు, వారికి డబ్బులు సైతం పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని గ్రామాల్లో మహిళలకు, చీరలు, ఆభరణాలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతో సంఘాల నాయకులను గంప గుత్తగా మాట్లాడుతూ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 అందిస్తున్నారు. రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలోనే రెండు గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి కోటికి పైగానే ఖర్చు చేశారంటే సర్పంచ్ పదవికి ఎంత గిరాకీ ఉందో తెలుస్తుంది. ఒక వర్గం వారు వెయ్యి ఇచ్చారంటే మరో వర్గం వారు వెళ్లి రూ.1500 ఇచ్చి వస్తున్నారు. ఒక వైపు గ్రామాల్లో ఓటర్లకు హామీలు ఇవ్వడంతో పాటు, డబ్బులు పంపిణీ చేయడంతో గెలిచిన తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది.
ఇంటింటికీ డబ్బులు, మద్యం
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో డబ్బు, మద్యం, మాంసంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ముందుకెళ్తున్నారు. వలస వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాహనాలను సమకూర్చుతున్నారు. ఒక్కో అభ్యర్థి ఐదు నుంచి రూ.10 లక్షల ఖర్చు చిన్న గ్రామపంచాయతీల్లో పెడుతుండగా.. మేజర్ గ్రామపంచాయతీల్లో అయితే రూ.80 నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఆ గ్రామాలకు వచ్చే నిధులు సైతం అంతగా ఉండవు. సర్పంచ్ హోదా కోసమే తప్ప చేసేదేమీలేదు. దీంతో పాటు, గ్రామాల్లో హామీలు ఇచ్చామంటే నెరవేర్చకపోతే ప్రజలు మరోసారి తిరస్కరించే అవకాశం ఉంటుంది.
రెబల్స్‌తో ఫలితాలు తారుమారు
జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు లభించాయి. అయితే కాంగ్రెస్‌లోనే చాలా మంది రెబల్స్ ఓడిపోయారు. బీఆర్‌ఎస్, బీజేపీలో రెబెల్స్ బెడద అంతంతమాత్రంగానే ఉంది. ఈ భయం మూడో విడతలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. బుధవారం జరగనున్న ఆరు మండలాల సర్పంచుల్లో అన్ని మండలాలు ధర్మపురి నియోజకవర్గం కిందకే వస్తాయి. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి లక్ష్మణ్‌కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నది తెలిసిందే. ఇప్పటికే జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్‌కు సీట్లు రాగా ధర్మపురిలో సైతం కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయి. మంత్రి ఇలాకాలో సైతం అనేక మంది రెబల్స్ ఉన్నారు. ఎవరిది పైచేయిగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే.


