వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి
బుగ్గారం: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. ఎన్నికలలో ప్రతి ఓటు కీలకం కానుండడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్రామాల నుంచి వలసవెళ్లిన వారి సమాచారం సేకరిస్తూ ఓటింగ్ రోజు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క ఓటుతోనే విజయాలు తారుమారవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు వలసవెళ్లిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
స్థానిక నాయకులకు బాధ్యతలు
వలస ఓటర్ల వివరాలు సేకరించడానికి గ్రామాల్లో అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారికి బాధ్యతలు అప్పగించారు. వారు రంగంలోకి దిగి తమ ఊరి నుంచి ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు..? వారిని ఎలా రప్పించాలి..? అనే విషయాలపై ప్రణాళిక వేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ఖర్చులన్నీ తామే భరిస్తామని హామీ ఇస్తూ పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒక చోటు నుండి వచ్చే అవకాశం ఉన్నవారి కోసం వాహనాలు సమకూర్చడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో అనేక మంది ఉద్యోగ, ఉపాధి రీత్యా నివాసం ఉంటున్నారు. అటువంటి వారిని రప్పిస్తే తమకు ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


