‘కోరుట్ల ఎమ్మెల్యే.. నీ నియోజకవర్గాన్ని చూసుకో..’
జగిత్యాల: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. మొదట మీ నియోజకవర్గ అభివృద్ధిని చూసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌సంజయ్‌కుమార్ అన్నారు. కోరుట్ల ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతూ జగిత్యాలకు వస్తున్నారని, ఒకవేళ చేతకాకపోతే తన వద్దకు వస్తే సీఎం, మంత్రితో మాట్లాడి నిధులు ఇప్పిస్తానని పేర్కొన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. మెడికల్ కళాశాలను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే 20 శాతం పనులు చేయలేకపోతున్నారని ఆరోపించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కళాశాలలు ఇస్తే అందులో జగిత్యాలకు వచ్చేలా కృషి చేశానని, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మెడికల్ కళాశాలకు రూ.40 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దమ్ముంటే కోరుట్లలో 100 పడకల ఆస్పత్రిని తీసుకురావాలని, మెట్‌పల్లి ఆస్పత్రికి మరమ్మతులు చేయించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధిక నిధులు మంజూరైంది జగిత్యాలకేనని, ఆ అభివృద్ధి ప్రజల కళ్లకు కట్టినట్లు కన్పిస్తుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్య, చెట్‌పల్లి సుధాకర్, జగన్, కూసరి అనిల్, పంబాల రాము పాల్గొన్నారు.


