డ్రా పద్ధతిలో వార్డుమెంబర్ గెలుపు
కథలాపూర్(వేములవాడ): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కథలాపూర్ మండలం ఇప్పపెల్లిలో ఒకటో వార్డు బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో గెలుపును నిర్ధారించారు. ఒకటో వార్డులో పూదరి గంగు, పానుగంటి లక్ష్మి బరిలో ఉన్నారు. ఇద్దరికీ 51 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీయగా పూదరి గంగు విజయం సాధించారు.
మృతశిశువుతో ఆందోళన
హుజూరాబాద్: హుజూరాబాద్ ఆస్పత్రి ఎదుట మృత శిశువుతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దాట్ల లత ఎనిమిది నెలల గర్భిణీ. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గురువారం పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లింది. సాయంత్రం కడుపునొప్పి వచ్చింది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా గర్భస్రావమైంది. వైద్యులు పరీక్షించి శిశువు చనిపోయి రెండురోజులు అవుతుందని చెప్పారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు హుజూరాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో పాప చనిపోయిందని ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరుగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి తెలిపారు.
హత్యాయత్నం కేసులో ఒకరి రిమాండ్
వేములవాడ: మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి, ఒకరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. నాగయ్యపల్లి సర్పంచ్ స్థానానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చింతపంటి మల్లేశం సర్పంచ్‌గా గెలుపొందగా సమీప అభ్యర్థి గోపు మధు ఓడిపోయారు. అతని భార్య గోపు మాలతి సైతం వార్డ్‌మెంబర్‌గా ఓడిపోయారు. తమ ఓటమికి అదే గ్రామానికి చెందిన ఏఎంసీ చైర్మన్ రొండి రాజు కారణమని కక్ష పెంచుకుని గుంటి శివ, గుంటి నగేశ్, మరో ఇద్దరితో కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడు రాజు ఫిర్యాదుతో వేములవాడరూరల్ పోలీస్‌స్టేషన్‌లో గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేశ్‌పై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోపు మధును శుక్రవారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. డీఎస్పీ ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.


