ఓట్ల లెక్కింపుపై ఫిర్యాదులు
మంథని: సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగలేదని పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మెండె రాజయ్య ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఓట్ల లెక్కింపు క్రమంలో తనకు ప్రత్యర్థి కన్నా అదనంగా ఒకఓటు వచ్చిందని, దీంతో గెలుపు తనదేనని ప్రకటించిన కొద్దిసేపటికే ఓటు చెల్లదని అధికారులు ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందన్నారు. అంతేకాకుండా ఆగమేఘాలపై అధికారులు తనను అయోమయానికి గురిచేసి డ్రా పద్ధతిన ప్రత్యర్థిని గెలిచినట్లు ప్రకటించారని అన్నారు. ఓట్ల లెక్కింపుల్లో అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు.
పెగడపల్లి సర్పంచ్ ఎన్నికపై..
పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి పంచాయతీ ఎన్నికల్లో అనుమానాలు ఉన్నాయని సర్పంచ్ అభ్యర్థి అల్లం సదయ్య పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ బండిళ్లపై గుర్తు కనిపించలేదని, లెక్కింపు సమయంలో తమ ఏజెంట్లను ఓట్ల ధ్రువీకరణకు అనుమతివ్వలేదని, కౌంటింగ్ విధానం సరిగా చేయకుండానే ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని, రీకౌంటింగ్ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నూనేటి సదయ్య యాదవ్, మాజీ జెడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్ తదితరులు ఉన్నారు.


