ఇక ఓటర్లకు ఎర
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల యత్నాలు డబ్బు, మద్యంతో ప్రలోభాలు తొలివిడత ప్రచారం, ప్రలోభాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తున్న వైనం
జగిత్యాల: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. ఇప్పటికే ప్రచారానికి తెరపడగా, ఇక ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో డబ్బు, మందు, మాంసంతో ప్రలోభాలకు గురిచేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీ అభ్యర్థి వెంట నిత్యం ఓ వందమంది మద్దతుదారులు ఉంటూ ఇంటింటా వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరికి ఉదయం టిఫిన్ నుంచి మొదలు మధ్యాహ్నం, రాత్రి వరకు భోజనాలు పెడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపైడెంది. కాగా, మొదటి విడత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు పెద్దగా ఖర్చు లేనప్పటికీ 2,3 విడతల్లో అభ్యర్థులకు సమయం ఎక్కువగా ఉండటంతో వారు ఖర్చుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపంచాయతీల్లో సైతం రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు పెడుతుండగా, మేజర్ పంచాయతీల్లో ఖర్చుకు లెక్కలేకుండా పోతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. చాలా పంచాయతీల్లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తుంటాయి. ఈనేపథ్యంలో లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం బాగుంటే వారిని వరిస్తుంది. దీంతో ప్రతీ ఓటును రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానుపోను వాహనాలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తున్నారు.
గెలుపు కోసం తంటాలు
ఆదివారం జరుగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడినప్పటికీ గెలుపు కోసం అభ్యర్థులు ప్రతీ ఇంటి తలుపు తడుతూ శ్రీఅవ్వ ఓటు వేయాలి, అన్న ఓటు వేయాలిశ్రీ అంటూ బతిమిలాడుతున్నారు. కాగా ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ, చాలా గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో రెబల్స్ గొడవ అత్యధికంగా ఉంది. దీంతో గెలుపు ఓటములపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులు మద్దతుదారులను కలుస్తూ ఓటు వేయాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మహిళ సంఘాలకు, కుల సంఘాలకు అనేక హామీలు ఇచ్చారు. గంపగుత్తగా పడే ఓట్‌లైన మహిళ సంఘాలు, రైతు సంఘాలు, యువత, కుల సంఘాలు వీటిపై దృష్టి సారిస్తున్నారు.
ఇక పంపకాలే..
ఇన్నిరోజులు ప్రచారం చేసి ఓట్లు వేయాలని అభ్యర్థించినా పంపకాలు మాత్రం ఆగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రచారంలో పాల్గొన్న వారితో పాటు, ఇంటింటికీ హామీ ఇవ్వడంతో పాటు, అటు డబ్బులు సైతం పంపకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మొదటి విడతలో ఓ వ్యక్తి డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే.
అభ్యర్థుల ఆందోళన
రెండో విడతకు ఒకరోజే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పోటీలో నిలవడంతో చాలా మంది అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా అప్పులు తెచ్చి మరీ బరిలో నిలిచారు. గెలుపోటములు సహజం అయినా ఎవరో ఒకరికి ఓటమి తప్పదు. కానీ, ఖర్చు మాత్రం ప్రతీ అభ్యర్థికి ఉంటోంది. కొందరు అభ్యర్థులైతే ఏకంగా భూములు కుదవపెట్టుకుని, వాహనాలను అమ్ముకుని, బంధువుల వద్ద అప్పు తెచ్చుకుని మరీ పోటీ చేస్తున్నారు. ఓడిపోతే ఎలా అంటూ ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.


