కాపర్‌వైరు దొంగలను గుర్తించాలి
ధర్మపురి: లిఫ్ట్ సబ్‌స్టేషన్లో చోరీకి పాల్పడిన కాపర్‌వైరు దొంగలను పోలీసులు గుర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని రాయపట్నం గ్రామంలో గోదావరి తీరాన ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి సబ్‌స్టేషన్ శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట పొలాల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ సబ్‌స్టేషన్‌లోని కాపర్ వైరును దొంగలు ఎత్తుకెళ్లడం బాధాకరమని, వారిని తక్షణం గుర్తించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కాపర్‌వైరు చోరీతో విద్యుత్ సబ్‌స్టేషన్ నడవని పరిస్థితి నెలకొందన్నారు. సంబంధిత ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాతో ఫోన్‌లో సంప్రదించి కొత్త సామగ్రి ఏర్పాటుకు అవసరమైన నిధులు వారంలోగా విడుదల చేయాలని సూచించారు. సబ్‌స్టేషన్ లేదని రైతులు అధైర్యపడవద్దని, అన్నదాతల సంక్షేమం కోసం నేనున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.


