పల్లె‘పోరు’ షురూ..!
జగిత్యాల: పల్లెపోరు మొదలైంది. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. మొదటివిడత ఏడు మండలాల్లో నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటిదశ మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 122 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 39 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 47 మంది ఆర్వోలు, 47 మంది ఏఆర్వోలను నియమించారు. సమస్యలుంటే పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో సహాయకేంద్రాన్ని ప్రారంభించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు అమలు
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై ఓటింగ్, పోస్టర్లు తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల గోడలపై రాతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే అధికారులపైనా చర్యలు తీసుకోనున్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
ప్రశాంతంగా పూర్తిచేయాలి
పంచాయతీ ఎన్నికల్లో లోటుపాట్లు రాకుండా చూ డాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు సూచించా రు. వారికి కలెక్టరేట్‌లో బుధవారం శిక్షణ ఇచ్చారు. అభ్యర్థులు అఫిడవిట్‌లో వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుందని, లేనిచో తిరస్కరించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్రచార వాహనాలకు అనుమతి తీసుకునేలా చూడాలన్నారు. నామినేషన్ ఒరిజినల్ పత్రాలను పంచాయతీలోని ఆర్వోల వద్ద పొందవచ్చని, జిరా క్స్ కాపీలు వాడొద్దన్నారు. అప్పీళ్లు ఉంటే ఆర్డీవోకు సమర్పించాలన్నారు. అనంతరం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఖర్చులు వినియోగించుకో వాలని, ప్రచార కరపత్రాలపై తప్పనిసరిగా ప్రింటర్ల సమాచారం ఉండాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు శాంతియుత వా తావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చేనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక నిఘా
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జిల్లా సరిహద్దుల్లో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలకు గురిచేసే వారిపై దృష్టి సారించారు. జిల్లాలో 75 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక నిఘా పెంచారు. ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు, సర్వైలైన్స్ బృందాలను నియమించారు.


