మల్లన్నా.. శరణు శరణు
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటలోగల దొంగమల్లన్న స్వామివారి జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం (దండివారం) కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉపవాసం ఉండి పట్నాలు వేసి కొత్తకుండలో బోనం వండి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు రాజేందర్, రఘునందన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. గొల్లకుర్మల ఢమరుక వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గొల్లపల్లి, బుగ్గారం, సారంగాపూర్, వెల్గటూర్, ధర్మపురి పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు. డీఎస్పీ రఘుచందర్, సీఐలు రాంనర్సింహారెడ్డి, ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి పర్యవేక్షించారు. మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. టికెట్ల ద్వారా రూ.84,860 ఆదాయం వచ్చినట్లు ఈవో విక్రమ్, ఫౌండర్ ట్రస్టీ శాంతయ్య తెలిపారు. ఎంపీడీవో రవీందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, వైద్య, అగ్నిమాపక, విద్యుత్‌శాఖ, దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు.
మల్లన్నా.. శరణు శరణు


