ఆనవాళ్లు కోల్పోతున్న డిస్ట్రిబ్యూటరీలు
కోరుట్ల రూరల్: ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు ఎక్కడికక్కడ గండ్లు పడి కాలువ ఆనవాళ్లు కోల్పోతున్నాయి. గండ్లు పడిన ప్రాంతం నుంచి నీరు వృథాగా వెళ్తూ.. చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పెద్దాపూర్ శివారు మొదలు జోగిన్‌పెల్లి వరకూ ప్రధాన కాలువ కింద డి–29 నుంచి డి–46 వరకూ 17 కాలువలున్నాయి. వీటి కింద వరితోపాటు మొక్కజొన్న, పసుపు పంటలు సాగవుతున్నాయి.
గండ్లుపడి వృథాగా పోతున్న నీరు
డిస్ట్రిబ్యూటరీ కాలువలకు గండ్లు పడి.. కోతకు గురై పలుచోట్ల పొలాలు, వాగులోకి నీరు వృథాగా పోతోంది. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొంది. గండ్లతో చేతికొచ్చే పొలాల్లోకి నీరు చేరి కోతలు ఆలస్యమవుతున్నాయి. కాలువల్లో గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగి నీరు ముందుకు సాగకుండా గండ్లవైపు వెళ్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. గండ్లు పూడ్చి కాలువలు మరమ్మతు చేయటంతోపాటు గడ్డి, పిచ్చిమొక్కలు తొలగించాలని రైతులు కోరుతున్నారు.


