బడికి రాని టీచర్లపై నిఘా
గొల్లపల్లి: విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా డుమ్మాకొట్టే ప్రభుత్వ ఉపాధ్యాయులకు చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ పటిష్ట చర్యలు చేపట్టింది. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) యాప్‌లో ఇన్, ఔట్ టైమ్‌పై ప్రత్యేక నిఘా పెట్టింది. బడికి రాని ఉపాధ్యాయులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల విద్యాశాఖ పనితీరుపై సమీక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్.. విద్యాబోధన మెరుగుపడేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 770 పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు 467, పాథమికోన్నత పాఠశాలలు 83, ఉన్నత పాఠశాలలు 189, కేజీబీవీ 16, మోడల్ స్కూళ్లు 13, టీజీఆర్‌ఎస్ రెండు ఉన్నాయి. ఇందులో ఎస్జీటీలు 1,183, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు 172, గెజిటెడ్ హెచ్‌ఎంలు 168, ఎస్‌ఏలు 1,832, పీడీలు 30, పీఈటీలు 10 కలిపి మొత్తం 3,395 మంది ఉన్నారు. ఉపాధ్యాయులు ఆయా పాఠశాల సమయంలోపు కచ్చితంగా ఎఫ్‌ఆర్‌ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉపాధ్యాయుడు సెలవు తీసుకోవాలంటే యాప్‌లో అప్లై చేసుకుని సంబంధిత హెచ్‌ఎంతో అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. కార్యాలయం పనుల కోసం, ట్రైనింగ్, ఆఫీస్ పని నిమిత్తం వెళ్లినట్లయితే ఓడీ (ఆన్‌డ్యూటీ) హాజరు కూడా వెళ్లిన చోటినుంచే పాఠశాల ముగిసే సమయంలోపు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల హెచ్‌ఎం ఉపాధ్యాయుల హాజరుతోపాటు విద్యార్థుల హాజరు కూడా నమోదు చేయించి గైర్హాజరైన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


