ధాన్యం కొనుగోలులో నాణ్యత పాటించాలి
పెగడపల్లి: ధాన్యం కొనుగోలులో నాణ్యతాప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ నిర్వాహకులకు సూచించారు. పెగడపల్లి, కొండాయపల్లి గ్రామాల్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీవో మనోజ్‌కుమార్, డీఎస్‌వో జితేందర్‌రెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలు, ఆన్‌లైన్ నమోదు రికార్డులు తనిఖీ చేశారు. తూకం చేసిన ధాన్యం బస్తాల బరువును పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలన్నారు. తహసీల్దార్ ఆనంద్‌కుమార్, ప్యాక్స్ సీఈవో గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


