ధర్మపురి: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళాసంఘాలకు మంచి రోజులు వస్తున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు కాకుండా కొత్తగా మరిన్ని సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మహిళలను ఆర్థి కంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇందులోభాగంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న సంఘాల్లో 16 నుంచి 60 ఏళ్ల వారిని సభ్యులుగా చేర్చుకోనున్నారు. 60 ఏళ్లు దాటినవారి కి వృద్ధ మహిళా సంఘం.. 16 నుంచి 18 ఏళ్లవారికి కిశోర బాలికల సంఘాలుగా ఏర్పాటు చేస్తారు.
అధికారుల భాగస్వామ్యంతో..
కిశోర్ బాలికల సంఘాలను గ్రామీణాభివృద్ధి, సంక్షేమశాఖ అధికారుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో వృద్ధులు, కిశోర బాలికల వివరాలను సేకరిస్తున్నారు. కొత్త సంఘాలను ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో కిశోర బాలికల అభ్యున్నతికి తోడ్పాటునివ్వనున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికలతోపాటు చదువు మధ్యలో మానేసిన వారి వివరాలను వీవోలు, అంగన్‌వాడీలు సేకరిస్తున్నారు.
జీవనోపాధి కోసం రుణాలు
ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఐదు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంటీన్‌కు ప్రభుత్వం రూ.10 లక్షల రుణసాయం అందించింది. అలాగే మండల సమాఖ్య పేరుతో జిల్లాలోని 18 మండలాలకు మండలానికో ఆర్టీసీ బస్సును ప్రభుత్వం మంజూరు చేసింది. ధర్మపురిలో శ్రీచైతన్య మండల సమాఖ్యకు బస్సు మంజూరైంది. దీంతో పాటు పెట్రోల్‌బంక్‌లు, సౌర ఉత్పత్రి కేంద్రాలు తదితర యూనిట్లు ఇవ్వనున్నారు.
లక్ష్యం రూ.770 కోట్లు
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం 2025–26 సంవత్సరానికి రూ.770 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 15,080 సంఘాలుండగా సెప్టెంబర్ వరకు రూ.402 కోట్ల రుణాలు అందించారు.
జిల్లా సమాచారం
పాత సంఘాలు : 15,080
సభ్యులు : 1,77,323
కొత్తగా ఏర్పాటైనవి : 617
సభ్యులు : 3,630


