ఖాకీల కోట.. రహీంఖాన్‌పేట
ఇల్లంతకుంట(మానకొండూర్): రహీంఖాన్‌పేట చిన్న గ్రామం. 1,321 వరకు జనాభా. నాడు వంకాయల పంటకు ప్రసిద్ధి. వంకాయల ఊరు అని కూడా పిలిచేవారు. గ్రామం నుంచి మహిళలు కాలినడకన పాలు, కూరగాయల గంపలతో ఇల్లంతకుంటకు వచ్చి అమ్ముకునేవారు. 1990 నుంచి పీపుల్స్‌వార్, జనశక్తి నక్సలైట్లు తయారయ్యారు. కమటం శ్రీనివాస్ పీపుల్స్‌వార్ దళ నాయకుడిగా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన కొద్ది నెలలకే జనశక్తి తీవ్రవాదులు 1997లో అతడి ఇంటిలోనే కాల్చి చంపారు. అదే గ్రామానికి చెందిన జనశక్తి నక్సలైట్ బత్తిని లచ్చయ్య 1999లో చిన్నలింగాపురం పరిధిలో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. నాడు పోలీస్ ఉద్యోగంలో చేరాలంటే కుటుంబంలో భయం ఉండేది. దాన్ని అధిగమిస్తూ 1993లో మెరుగు వీరయ్య మొదటిసారిగా పోలీస్ ఉద్యోగం సాధించాడు. తర్వాత బత్తిని వెంకటేశం, పవన్, బిళ్ళవేని శ్రీనివాస్, సురేశ్, గడ్డమీది శ్రీకాంత్, రాజశేఖర్.. ఇలా మూడు కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున పోలీస్ ఉద్యోగాలు పొందారు. ఆయా సామాజికవర్గాల నుంచి మొత్తం 21 మంది ఖాకీ కొలువులు నిర్వర్తిస్తున్నారు.


