కడెంలో ప్రమాదం.. జూలపల్లిలో విషాదం
జూలపల్లి(పెద్దపల్లి): నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనుకుంట్ల రాజశేఖర్‌రెడ్డి(40) దుర్మరణం చెందడం ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. జూలపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్‌రెడ్డి కరీంనగర్‌లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్రవంతి ఉన్నారు. ఆమె సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నార. వీరికి ఒక కుమారుడు, ఒక కూతరు ఉన్నారు. కరీంనగర్‌లో కుటుంబంతో నివాసం ఉండే రాజశేఖర్‌రెడ్డి శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యారు. కడెం ప్రాజెక్టు చూసేందుకు కారులో వెళ్లారు. ప్రాజెక్టు పక్కనే నిల్చొని సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడిపోయాడా, లేక కుటుంబ కలహాలతో కావాలనే ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. గ్రామస్తులతో కలివిడిగా ఉండే రాజశేఖర్‌రెడ్డి మృతితో స్వగ్రామం జూలపల్లిలో విషాదం అలముకుంది.
ప్రాజెక్టులో పడి ఉపాధ్యాయుడి మృతి


