ఇందిరాగాంధీ జీవితం ఆదర్శం
జగిత్యాలటౌన్: దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ ఆదర్శనీయమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు ఇందిరాభవన్‌లో ఇందిర చిత్రపటానికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, దేశ సర్వతోముఖాభివృద్ధికి బ్యాంకులను జాతీయం చేసి పేదరిక నిర్మూలనకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పేదల కోసం గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇళ్లు కట్టించి గూడు కల్పించారని కొనియాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ తాటిపర్తి విజయలక్ష్మి, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు కళ్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, కోండ్ర జగన్, రఘువీర్‌గౌడ్, గుండ మధు తదితరులు పాల్గొన్నారు.


