మాస్టర్‌ప్లాన్‌కు ముందడుగు | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ప్లాన్‌కు ముందడుగు

Oct 30 2025 9:06 AM | Updated on Oct 30 2025 9:06 AM

మాస్టర్‌ప్లాన్‌కు ముందడుగు

మాస్టర్‌ప్లాన్‌కు ముందడుగు

ఏళ్లుగా అభివృద్ధికి నోచని జగిత్యాల బల్దియా ఇరుకురోడ్లతో జనం ఇబ్బందులు ‘ప్లాన్‌’ అమలైతే మారనున్న రూపురేఖలు ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు

జగిత్యాల: జగిత్యాల మాస్టర్‌ప్లాన్‌కు ఇటీవల ఆ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్లాన్‌ రూపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాలకు 1983లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ తప్ప ఇప్పటివరకు మరోసారి నోచుకోలేదు. గత ప్రభుత్వంలో రూపొందించినా వివిధ కారణాలతో రద్దయ్యింది. అప్పటినుంచి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.

ఈసారైనా ముందుకెళ్లేనా...

మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్‌ అమలు కాకపోవడంతో రోడ్లంతా ఇరుకుగా మారాయి. జోన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ 1983 నాటి మాస్టర్‌ ప్లానే కొనసాగుతోంది. జిల్లాకేంద్రమై తొమ్మిదేళ్లు అవుతున్నా మాస్టర్‌ ప్లాన్‌కు మాత్రం ముందడుగు పడటం లేదు. గత ప్రభుత్వ హయాంలో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. కొన్ని గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం కొత్త ప్లాన్‌ అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చింది. పబ్లిక్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. రహదారుల విస్తరణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌, జోన్ల గుర్తింపు, అభివృద్ధి చేయాల్సిన పనులన్నీ గుర్తించారు. అయితే రైతుల ఆందోళనతో రద్దయిపోయింది.

భూములు పోతున్నాయని రైతుల ఆందోళన

గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్‌ ప్లాన్‌లో రైతులకు చెందిన భూములను రిక్రియేషన్‌ జోన్‌లో చేర్చడంతో అప్పట్లో అది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన తీవ్రతరం చేయడంతో కౌన్సిల్‌ ఏర్పాటు చేసి మాస్టర్‌ ప్లాన్‌ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీంతో మాస్టర్‌ ప్లాన్‌ నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు రావడం.. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్లాన్‌ కాస్త మరుగున పడింది. తాజాగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ రాజాగౌడ్‌, డీటీసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ అశ్విని, రీజినల్‌ ఆఫీసర్‌ ఏడీ జ్యోతితో మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో రిక్రియేషన్‌ జోన్‌, ఇండస్ట్రియల్‌ జోన్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి చర్చించి చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ అనేది పట్టణ భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో నూతనంగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు కాకపోవడంతో ఇరుకై న రోడ్లు, వాహనాల పార్కింగ్‌ లేకపోవడంతో ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, ఎడ్యుకేషన్‌ ఏరియాలు, లేఅవుట్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అభివృద్ధి చేయాల్సిన స్థలాలు ఖాళీగా ఉండిపోతున్నాయి.

జగిత్యాల.. 1985లోనే సెకండ్‌ గ్రేడ్‌మున్సిపాలిటీ హోదా పొందింది. 2009లో గ్రేడ్‌–1 మున్సిపల్‌గా అవతరించింది. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో దాదాపు 50 వేల నివాసాలు ఉన్నాయి. 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నివాసాలు రెట్టింపు కావడంతో తెలంగాణ మున్సిపల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద గతంలోనే మాస్టర్‌ప్లాన్‌కు ఎంపికై ంది.

మారనున్న రూపురేఖలు

జిల్లాకేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉంది. ఇక్కడ 48 వార్డులున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తే పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం పట్టణంలో ప్రతి రోడ్డు చిన్నగా, ఇరుకుగా ఉన్నాయి. ప్లాన్‌ అమలైతే రోడ్లు వెడల్పు కావడంతో పాటు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు, మురికికాలువలు కొత్తరూపు సంతరించుకుంటాయి. 20 ఏళ్లకు సరిపడా ప్రణాళిక రూపొందిస్తారు. రోడ్లు ఎంత వెడల్పుగా ఉండాలి..? ఎక్కడ ఏ డెవలప్‌మెంట్‌ జరుగుతుంది..? ఎడ్యుకేషన్‌ జోన్‌, ఇండస్ట్రీయల్‌ జోన్‌, రిక్రియేషన్‌ జోన్‌ (లంగ్స్‌ స్పేస్‌) నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణాల అనుమతులు సులభంగా లభిస్తాయి. రోడ్లు పెద్దవిగా ఉంటాయి. పట్టణం చుట్టూ ఉన్న చెరువులకు హద్దులు నిర్ణయించి అక్కడ అనుమతి ఇవ్వొచ్చా..? లేదా..? అన్నది నిర్ణయిస్తారు. మాస్టర్‌ ప్లాన్‌ ఆర్డీ రూపొందించిన తర్వాత రోడ్లు వెడల్పు చేయడానికై నా.. ఇతరత్రా నిర్మాణాలు చేయడానికై నా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయవచ్చు. ప్రస్తుతం ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణం, లేఅవుట్లు లేకుండానే పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement