ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రం నడిబొడ్డున ఆక్రమణకు గురైన రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్‌బంక్ యజమానిగా భావిస్తున్న మంచాల కృష్ణ హైకోర్టుకు వెళ్తే కిబాల జిరాక్స్ కాపీ వాస్తవికతను నిర్ధారించడం వీలుకాదని, నిజనిర్ధారణ జరిగి, ఆక్రమిత భూమిపై చర్యలు చేపట్టే వరకు మున్సిపల్ తీర్మానం 140ని పక్కన పెట్టాలని మాత్రమే తీర్పు చెప్పిందని, అంతమాత్రాన కోర్టు యాజమాన్య హక్కులు కల్పించినట్టు కాదని పేర్కొన్నారు. ఆ స్థలానికి కృష్ణ యజమాని కాదని, మున్సిపాలిటీనే యజమాని అని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు తాత్కాలిక కేటాయింపులు చేస్తుంటాయని, అలాంటి వాటిని ప్రజావసరాల దృష్ట్యా ఎప్పుడైనా తిరిగి తీసుకునే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని, దారం వీరమల్లయ్యకు కిబాల ఆధారంగా భూమి కేటాయించినందున ఆ డాక్యుమెంట్ వాస్తవికతను నిర్ధారించేందుకు విజిలెన్స్ కమిషనర్, ఇతర సంస్థలతో విచారణ జరిపి నిజాలు వెలికితీయాలన్నారు. కిరోసిన్, డీజిల్ అవుట్‌లెట్ కోసం 20గుంటల భూమిని బల్దియా కేటాయించగా కేవలం 4గుంటల స్థలంలో మాత్రమే విక్రయాలు జరుపుతున్నారని, మిగతా 16గుంటల స్థలంలో ఇతర వ్యాపారాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కిబాలాను రద్దు చేసి నగరం నడిబొడ్డున ఆక్రమణకు గురైన భూమిని రక్షించాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, మన్సూర్, కల్లెపెల్లి దుర్గయ్య, రాంచంద్రారెడ్డి, అనిత, రఘువీర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


