చేతికొస్తున్న పంట
ఆరబెట్టేందుకు తంటా
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాలు కోతకొచ్చినప్పటికీ.. కొయిస్తే ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకూ సరిపడా స్థలం లేదు. పది నుంచి 20 రాశులు రాగానే స్థలం కొరత ఏర్పడుతోంది. ధాన్యం సేకరణకు జిల్లాలో 421 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం 50లోపు కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకు సరైన స్థలాలే లేవు. కొన్నిచోట్ల గుట్ట బోర్లు, ఎస్సారెస్పీ కాలువ మట్టిని చదును చేసుకుని ధాన్యం ఆరబెడుతున్నారు. మరి కొన్ని చోట్ల ప్రైవేట్ స్థలాలను లీజుకు తీసుకుంటున్నారు. స్థల యజమానులు ప్రతి సీజన్‌లో లీజు ధ ర పెంచుతున్నారు. నిర్వాహకులకు రూ.లక్షల్లో క మీషన్ వస్తున్నా.. కేంద్రాల్లో రైతులు ధాన్యం పో సేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు.
కేంద్రాల్లోనే ఆరబోత
పొలం కోయించిన తర్వాత ఆరబెట్టి, తేమ వచ్చిన తర్వాతే కేంద్రాలకు ధాన్యం తేవాలి. అయితే పొలంలో ఆరబెట్టి తిరిగి కేంద్రాలకు తీసుకురావడానికి రైతుకు రెట్టింపు ఖర్చవుతుంది. పైగా కూలీలు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో కోయించిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో నేరుగా కేంద్రాలకు తెస్తున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో తేమ 17శాతం లోపు రావడానికి కనీసం వారం రోజులు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తోంది. పొలాలు దాదాపు 90 శాతం కోతకు వచ్చాయి. ఇప్పటికే కేంద్రాలన్నీ నిండిపోవడం.. ఇంకా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం.. ధాన్యం తరలించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వరిని కోయాలా..? వద్దా..? అని రైతులు తల పట్టుకుంటున్నారు.
కవర్లకే తడిసిమోపెడు
కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో రైతులే ధాన్యం పోసేందుకు భూమిని చదును చేసుకుంటున్నారు. కవర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కో కవర్‌కు రోజుకు రూ.50 నుంచి రూ.80వరకు వెచ్చిస్తున్నారు. ధాన్యం కాంటా అయ్యే వరకు 15 నుంచి 20రోజులు పడుతోంది. అప్పటివరకు కవర్ల ఖర్చే రైతులకు తడిసి మోపెడవుతోంది. కేంద్రాల్లో కనీసం టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో రైతులే సొంతంగా కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.


