పల్లి విత్తనం.. సబ్సిడీకి మంగళం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా రైతులు యాసంగిలో వేరుశనగ (పల్లి) పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. విత్తనాలపై గతంలో 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ ఇవ్వగా.. ఈ ఏడాది ఎత్తివేయడంతోపాటు చివరకు నాణ్యమైన విత్తనాలను కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ఓపెన్ మార్కెట్లో కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు పెట్టి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
రైతులపై చిన్న చూపు
నూనెగింజల ఉత్పత్తి పెంచే లక్ష్యంతో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పల్లి విత్తనాలను సరఫరా చేసేది. ఈ ఏడాది మాత్రం ఈ పథకాన్ని కేవలం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబగద్వాల, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలకు మాత్రమే వర్తింపజేశారు. ఈ పథకం కింద ఎకరాకు సరిపడా 60 కిలోల విత్తనాన్ని ఆయా జిల్లాల్లో ఇస్తున్నారు. జిల్లా వానాకాలంలో మొక్కజొన్న పంట వేసిన తర్వాత.. యాసంగి పంటగా పల్లి సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులకు పల్లి విత్తనం దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో కొంతలో కొంత వేరుశెనగ విత్తనాన్ని జిల్లా రైతులకు ఇస్తుండేవారు. ఈ ఏడాది విత్తనాలకు పూర్తిగా మంగళం పాడారు. కొన్ని సీజన్లలో పంటను తక్కువ విస్తీర్ణంలో వేయడంతోనే జిల్లాను జాతీయ నూనెగింజల మిషన్ కింద చేర్చలేదని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 10 వేల ఎకరాల్లో పల్లి సాగు
జిల్లాలో పల్లిని దాదాపు 10వేల ఎకరాల్లో సాగు చేస్తారు. జగిత్యాల, గొల్లపల్లి, మెట్‌పల్లి, మల్లాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా సాగవుతుంది. చాలాగ్రామాల్లో వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న పండించిన తర్వాత పల్లిని ఎంచుకుంటారు. జగిత్యాల మండలంలోనే దాదాపు 70 నుంచి 100 ఎకరాల వరకు సాగు చేస్తారు. పచ్చి పల్లికాయకు మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో పాటు ఇటీవల చాలామంది వినియోగదారులు ఆయిల్ ప్యాకెట్లు కొనకుండా రైతుల వద్ద నేరుగా పల్లికాయ కొని గానుగ పట్టించి తీసిన నూనెను వాడుతున్నారు. ఫలితంగా క్వింటాల్‌కు రూ.7 వేల వరకు పలకాల్సిన ధర ఓపెన్ మార్కెట్‌లో రూ.13వేల నుంచి రూ.15వేల పైనే పలుకుతుంది. పచ్చిపల్లికాయను తెంపి ట్రాక్టర్లలో నేరుగా వినియోగదారుల వద్దకే వెళ్తుండడంతో చూస్తుండగానే అమ్ముడుపోతోంది.
ఎర్ర నేలల్లో దిగుబడి ఎక్కువ
జిల్లాలో ఎర్రనేలలు ఎక్కువ. ఈ నేలల్లో పల్లికాయ బాగా పండుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం.. రెండుమూడు నీటి తడులు ఇస్తే సరిపోతుంది. ఫలితంగా కోతులు, అడవి పందుల బెడద ఉన్నా పల్లి పంటను రైతులు ఎంచుకుంటున్నారు. కానీ.. విత్తనం దొరకడమే గగనంగా మారుతోంది.
యాసంగిలో నూనెగింజల పంట వైపు రైతన్నల చూపు
పచ్చి పల్లికాయకు మార్కెట్‌లో మంచి డిమాండ్


