‘మా ఇంటికి దారి చూపండి’
జగిత్యాలటౌన్: తమకు కేటాయించిన ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం నిర్మించిన దారినే కొందరు ఆక్రమిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తమ ఇంటికి దారి చూపాలని వెల్గటూర్ మండలం జగదేవుపేటకు చెందిన నూకల నర్సవ్వ, మల్లయ్య వృద్ధ దంపతులు కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. అక్కడే వంటావార్పు చేసేందుకు సిద్ధమయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. జగదేవుపేటకు చెందిన మల్లయ్య, నర్సవ్వ దంపతులకు 1981లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది. ఆ ఇంటికి రోడ్డు కూడా నిర్మించింది. అయితే కాలనీకి చెందిన కొందరు దారికి అడ్డంగా మట్టి, బండలు పోశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆ దంపతులు గ్రామ కార్యదర్శి మొదలు.. ఎంపీడీవో, తహసీల్దార్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. రెండేళ్లుగా తొమ్మిదిసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశా రు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా.. కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదు. మంత్రి అడ్లూరి, చివరకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లోనూ ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ఆక్రమణను తొలగించినా.. వారు వెళ్లిపోగానే కబ్జాదారులు మళ్లీ రోడ్డును ఆక్రమించుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తాజాగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రాజాగౌడ్ కలెక్టర్ ఆదేశాల మేరకు బాధితులను పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు వెనుదిరిగారు.


