రాజకీయాలు ఎన్నికల వరకే..
రాయికల్: రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఇప్పుడు తన దృష్టి అంతా అభివృద్ధిపైనే అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. కొత్తపేట రాజరాజేశ్వర నాగాలయం కమిటీ సభ్యులు శనివారం ప్రమాణస్వీకారం చేయగా.. కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.17లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ నాగాలయంలో కల్యాణ మండపానికి రూ.10 లక్షలు, ధ్యాన మందిరానికి రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యబోధన అందుతోందని, రూ.5లక్షలతో సారంగాపూర్, రూ.7లక్షలతో బీర్‌పూర్ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, బల్దియా కమిషనర్ మనోహర్‌గౌడ్, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఆలయ కమిటీ చైర్మన్ దానవేని రాములు, సభ్యులు సత్యనారాయణరావు, పల్లపు వెంకట్, లచ్చన్న, ముక్కెర లక్ష్మీ, పోతవేని సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్‌రావు, అచ్యుత్‌రావు, సామల్ల వేణు, రాంమూర్తి పాల్గొన్నారు.


