రెండేళ్లయినా రోళ్లవాగు పూర్తికాదా..?
సారంగాపూర్: కాంగ్రెస్ అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా.. రోళ్లవాగు ప్రాజెక్టుకు కనీసం షటర్స్ బిగించలేదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని అంటున్న ఎమ్మెల్యే సంజయ్ రెండేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోళ్లవాగుకు షటర్స్ బిగించలేని ప్రభుత్వంలో బీర్‌పూర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే బీర్‌పూర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసిన విషయం ఎమ్మెల్యేకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి నిధులు తెస్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే షాడో కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, మాజీ సర్పంచ్ భైరి మల్లేశం, నాయకులు వొడ్నాల జగన్, సాంబరి గంగాధర్ ఉన్నారు.


