ఆంక్షలు లేకుండా మక్కలు కొనాలి
జగిత్యాలటౌన్/జగిత్యాలరూరల్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 18 క్వింటాళ్ల నిబంధన సడలించి 30 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు రాసిన లేఖను గురువారం మార్కెట్ కార్యదర్శికి అందజేశారు. మార్క్‌ఫెడ్ కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళారులను నిలువరించేందుకు రైతులు నేరుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసిన అనంతరం దినుసును కేంద్రానికి తీసుకువచ్చేలా ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మొక్కజొన్నపై అవగాహన పెరిగి కొయ్య మొక్క సాగు చేస్తుండటంతో పెట్టుబడి వ్యయం తగ్గి దిగుబడి పెరిగిందన్నారు. ఎకరాకు 30– 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంటే 18క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసేలా పరిమితి విధించడంతో రైతులు దళారుల బారిన పడి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నాఫెడ్ సహకారంతో పరిమితులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట జున్ను రాజేందర్, ధర రమేశ్‌బాబు, అల్లాల రమేశ్‌రావు, ముంజాల రఘువీర్, రాజిరెడ్డి, సాయి, రవి తదితరులున్నారు.


