
ఆస్పత్రిలో అందని రిపోర్ట్‌లు
నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం రిపోర్టుల కోసం ఎదురుచూపు పేపర్ కొరతతో రోగుల ఇబ్బంది 15 రోజులైనా అందని రిపోర్ట్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో పరిస్థితి
జగిత్యాల: ఆపదలో ఆస్పత్రికి వచ్చినవారిని పరిశీలించి రోగ నిర్ధారణ కోసం వివిధ పరీక్షలు రాస్తుంటారు. ఆ రిపోర్ట్‌లు వచ్చిన అనంతరం వైద్యులు పరిశీలించి.. రిపోర్ట్‌లను బట్టి చికిత్సకు సంబంధించిన మందులు రాస్తారు. అయితే జిల్లా కేంద్రంలోని ప్రధానాస్పత్రికి వస్తున్న రోగులు మాత్రం ఈ నిర్ధారణ పరీక్షల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులను వైద్యులు నిర్ధారణ పరీక్షలకు పంపించడం.. వారు రక్తనమూనాలు సేకరించడమే తప్ప రిపోర్ట్‌లు మాత్రం ఇవ్వడం లేదు. 15 రోజులుగా రిపోర్ట్‌లు రేపుమాపు అంటూ ల్యాబ్ సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా రోగులు ఆందోళన చెందుతున్నారు. రిపోర్టులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.
స్టేషనరీ లేకనేనా..?
రోగుల వద్ద శాంపిల్స్ తీసుకున్న అనంతరం వాటిని పరీక్షించి రిపోర్ట్‌లను పేపర్లపై ఇస్తుంటారు. కానీ ప్రధాన ఆస్పత్రిలో నిధులు లేకనో.. ఏమోగానీ రిపోర్టులు మాత్రం ఇవ్వడం లేదు. పేపర్ స్టేషనరీకి సంబంధించిన సుమారు రూ.5లక్షలు బిల్లు పెండింగ్‌లో ఉందని, అందుకే పేపర్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది. విషయాన్ని రోగులకు ఎలా చెప్పాలో తెలియక ల్యాబ్ నిర్వాహకులు కాలం గడుపుతూ వస్తున్నారు.
పేపర్‌పై రాసి ఇస్తూ..
రోగులు డిమాండ్‌గా అడిగితే ల్యాబ్‌కు సంబంధించిన నిర్వాహకులు చిన్న పేపర్‌పై రాసిస్తున్నారు. అసలు అవి ఏం రిపోర్ట్‌లో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేపర్ లేకపోవడంతో కంప్యూటర్ ద్వారా వచ్చే ప్రింట్ ఇవ్వకపోవడంతో రాసి ఇస్తున్నారు. ఫలితంగా సరైన చికిత్స అందే అవకాశం ఉండదు.
రోగ నిర్ధారణ చేసేదెలా?
ప్రధానాస్పత్రిలోని ల్యాబ్‌లో అన్ని సౌకర్యాలు ఉండాల్సి ఉంటుంది. కానీ.. పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌లు ఇవ్వడానికి స్టేషనరీ లేకపోవడం శోచనీయం. రోగులు 15 రోజులుగా ఆస్పత్రిలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులకు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి కంప్యూటర్‌లో రిపోర్ట్ తయారుచేస్తున్నారే గానీ ప్రింట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే పేపర్‌పై రాసి ఇస్తున్నారు. ఫలితంగా రోగ నిర్ధారణ ఇబ్బందిగా మారుతోంది. రక్త, మూత్ర పరీక్షల శాంపిళ్లను రెండు వారాల క్రితం ఇచ్చామని, ఇప్పటి వరకు రిపోర్ట్టలు ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిపోర్ట్‌లు రాకపోవడంతో వైద్యులు మందులు రాయలేకపోతున్నారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
స్టేషనరీ రాకపోవడంతో చిన్నపాటి ఇబ్బంది ఏర్పడింది. రోగులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. ల్యాబ్ పరీక్షలు చేసి అర్థమయ్యేలానే పేపర్‌పై రాసి ఇస్తున్నాం. స్టేషనరీ రాగానే రిపోర్ట్‌లు వెనువెంటనే ఇచ్చి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– సుమన్‌రావు, ఆర్‌ఎంవో
అధికారులు స్పందించాలి
ఇంత పెద్ద ఆస్పత్రిలో మెడికల్ రిపోర్ట్స్‌కు సంబంధించిన స్టేషనరీ లేకపోవడంతో ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఆస్పత్రిలో అందని రిపోర్ట్‌లు

ఆస్పత్రిలో అందని రిపోర్ట్‌లు