
మక్కల కొనుగోలులో దళారులకు చెక్
జగిత్యాలఅగ్రికల్చర్: మక్కల కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట వేసేందుకు మార్క్‌ఫెడ్ సంస్థ చర్యలు తీసుకుంటోంది. రైతులకే లబ్ధి చేకూరేలా పలు నిబంధనలను తీసుకొచ్చి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కొందరు దళారులు గ్రామాల్లో తక్కువ ధరకు రైతుల నుంచి మక్కలు కొని అదే రైతుల పేరిట మార్క్‌ఫెడ్‌కు విక్రయిస్తున్నారు. అయితే ఈ సారి అలా జరగకుండా ఏర్పాట్లు చేశారు. రైతే ఈసారి కొనుగోలు కేంద్రానికి వచ్చేలా నిబంధనలు మార్చారు. గత సీజన్‌లో ఆధార్‌కార్డు అనుసంధానంగా మక్కల కొనుగోళ్లు చేపట్టగా.. ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం రైతు కేంద్రానికి వస్తే ఆధార్‌కార్డు నంబర్‌తో బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్ర తీసుకుని మక్కలు కొంటారు. దీనివల్ల దళారులకు చెక్ పెట్టినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొనుగోలు తర్వాత డబ్బుల చెల్లింపు కూడా ఆధార్‌కార్డును ప్రమాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. పైగా వ్యవసాయ శాఖ చేపట్టిన పంట సర్వేలో కూడా రైతు మక్క వేసినట్లు నిర్ధారణ జరగాల్సి ఉంటుంది. మొత్తంగా రైతు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, సెల్‌నంబర్, ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉండాల్సి ఉంది.
జగిత్యాల జిల్లాలో 13 మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు కేవలం నాలుగు కేంద్రాలనే ప్రారంభించారు. మెట్‌పల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ప్రారంభించినా.. తేమశాతం ఎక్కువగా ఉండటంతో కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకాలేదు. మక్కల్లో తేమ 14శాతం కంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో.. గింజలు ఆరడం లేదు. కేంద్రాలకు వచ్చిన గింజల్లో తేమ శాతం 24 నుంచి 28 వరకు వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన మక్కలు తీసుకొచ్చి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 పొందాలని మార్క్‌ఫెడ్ అధికారులు సూచిస్తున్నారు. గతంలో కొన్ని చోట్ల తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేయడం.. వాటిని గోదాముల్లో నిల్వచేయడంతో పురుగులు పట్టి తీవ్ర నష్టం వచ్చిందని, ఈ సారి అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
ప్రారంభించింది నాలుగు కేంద్రాలే..