
తాళంవేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్ర దాటాక దొంగలు తాళం వేసిన నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంటి నుంచి ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన వెన్నం శ్రీనివాస్ దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆయన భార్య ఇంటికి తాళంవేసి ఊరు వెళ్లింది. ఆ ఇంట్లో నుంచి సుమారుడు మూడు తులాల బంగారం, 41 తులాల వెండి ఎత్తుకెళ్లారు. షేక్ షబానా ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారం, 12 తులాల వెండి, రూ.50 వేలు, ద్యాగల నరేశ్ ఇంటి నుంచి రూ.1.70 లక్షలు, మూడు గారు గొలుసులు, మంథని కవిత ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. గుమ్ముల రాజేశం ఇంట్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. సోమవారం ఉదయం 2.30 గంటల నుంచి 3 గంటల సమయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బంగారం, నగదు, బైక్ ఎత్తుకెళ్లిన దొంగలు