
లోక కల్యాణ్ మేళా
జగిత్యాల: పీఎం స్వనిధి స్థానంలో లోక కల్యాణ్ పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మొదట సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేసుకునే వారికి సైతం అవకాశం కల్పించారు. గతంలో రుణాలు తీసుకున్న వారితో పాటు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకునే వారికి సైతం అవకాశం ఇస్తున్నారు. చాలా మంది కొత్తగా వీధివ్యాపారం చేసుకునే వారికి అవగాహన లేక ఈనెల 15 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మున్సిపాలిటీల పరిధిలో..
మున్సిపాలిటీల్లో ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మ నిర్భార్ నిధి (పీఎం స్వనిధి) పథకం ప్రవేశపెట్టింది. తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేలు అందించి, నాల్గో విడతకు వచ్చేసరికి ఈ పథకాన్ని ఆపేశారు. దీంతో ఇక రుణాలు వస్తాయో లేదోనన్న ఆందోళన చిరువ్యాపారుల్లో మొదలైంది. తాజాగా వీధివ్యాపారాలకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వనిధి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
లోక్ కల్యాణ్ మేళా..
9 నెలల పాటు పీఎం స్వనిధి పథకం నిలిచిపోగా, ప్రస్తుతం లోక్ కల్యాణ్ మేళా పేరిట రుణాలు అందించనున్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తుకు గడువు పెంచారు. ఇప్పటికే ఉన్నతాధికారులు మెప్మా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈసారి శిబిరాలు ఏర్పాటు చేసి పాతవారితో పాటు, కొత్తవారికి సైతం రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొదటి విడతలో రూ.10 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.15 వేలకు పెంచారు. ఎవరైతే సక్రమంగా చెల్లిస్తారో వారికి రూ.20 వేలు ఇవ్వనున్నారు. గతంలో రుణం తీసుకుని సక్రమంగా చెల్లించిన వారుంటే వారికి రూ.50 వేలు అందిస్తారు. క్రెడిట్‌కార్డులు కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. రూ.లక్ష లిమిట్‌తో క్రెడిట్‌కార్డు వాడుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
డిజిటల్ ప్రోత్సాహం
చిరువ్యాపారులకు డిజిటల్ ప్రోత్సాహం అందించా లనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్స్ అందించారు. ప్రస్తు తం ప్రతీ చిరువ్యాపారి డిజిటల్ ద్వారానే లావాదేవీ లు నిర్వహిస్తున్నారు. కొత్త రుణాలు తీసుకునే వారి కి త్వరితగతిన ప్రాసెసింగ్ చేయనున్నారు. లబ్ధిదా రులు పీఎం స్వనిధి మొబైల్‌యాప్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు, క్యూఆర్ కోడ్ పొందవచ్చు. మున్సిపల్ అఽ దికారులు అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
లోక్ కల్యాణ్ మేళా గడువు ఈనెల 15 వరకు ఉంది. కొత్త, పాత వీధివ్యాపారులకు మంచి అవకాశం. రుణాలు తీసుకుని లబ్ధి పొందాలి. ప్రతీ మున్సిపాలిటీలో కార్యక్రమం చేపడతాం. విడతల వారీగా రుణం చెల్లిస్తే మళ్లీ అత్యధిక రుణాలు పొందే వీలుంటుంది.
– రాజాగౌడ్, అడిషనల్ కలెక్టర్
పాత వీధివ్యాపారులు ఇలా..
బల్దియా వ్యాపారులు లక్ష్యం దరఖాస్తు రుణం మంజూరు ఇచ్చిన రుణాలు
జగిత్యాల 6,005 780 540 483 473
కోరుట్ల 4,081 539 210 154 145
మెట్‌పల్లి 3,548 384 239 206 204
రాయికల్ 815 208 121 114 112
ధర్మపురి 858 199 150 107 102