
ధర్మపురి క్షేత్రానికి గోదావరి మణిహారం
ధర్మపురి: నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి పుణ్యక్షేత్రానికి గోదావరి నది ఒక మణికంఠహారంగా ప్రసిద్ధి చెందిందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు అన్నారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సౌజన్యంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీమఠం స్థలంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చారు. నృసింహుడి పుణ్యక్షేత్రానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని. వేద పండితులకు పుట్టినిల్లయిన ఇక్కడి గోదావరి దక్షిణముఖంగా ప్రవహించడం గొప్ప విషయమని అన్నారు.
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దరుత దూర! అనే మకుఠంతో రాసిన ధర్మపురి నివాసి అయిన శేషప్ప కవి రాసిన పద్యాన్ని చాగంటి వివరించారు. భగవంతుని నామస్మరణ మానవ మనుగడకు ఎంతో మోక్షమని సూచించారు. ధర్మపురిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహుడి నామస్మరణలు, నరసింహుడు నరుడిగా, సింహంగా మారిన ఆయన మహిమాని త్వం, రాక్షసుడైన హిరణ్యకశిపుడు, భక్తి ప్రపత్తుడైన ప్రహ్లాదుడిపై భక్తులకు వివరించారు. 54 లక్షల జీవరాశుల్లో వాయుపుత్రుడైన హన్మంతునికి భగవంతుడు ప్రత్యేక స్థానం కల్పించినట్లు వివరించారు.
చాగంటికి ఘన స్వాగతం
ధర్మపురి పుణ్యక్షేత్రానికి చేరుకున్న చాగంటికి ఆలయం ఆధ్వర్యంలో ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, పాలకమండలి స్థానిక నందీ కూడలి వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాగంటి స్వామివారిని దర్శించుకున్నారు. చాగంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ సన్మానించారు. ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌లు బందోబస్తును ఏర్పాటు చేశారు.