
కట్టలకు పగుళ్లు.. ప్రమాదంలో చెరువులు
రైతులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాకేంద్రం చుట్టూ చెరువులు ఉన్నాయి. కొన్ని కట్టలు కుంగిపోయి పగుళ్లు బారాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. త్వరలోనే మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఈఎన్‌సీ దృష్టికి తీసుకెళ్లాను. లోతట్టు ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి.
– సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
చర్యలు తీసుకుంటున్నాం
చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతు చర్యలు చేపడతాం. అలాగే కాలువల్లో పూడిక తీసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు రానీయం.
– ఖాన్, ఎస్సారెస్పీ ఈఈ
జగిత్యాల: జిల్లా కేంద్రం చుట్టూ మోతె చెరువు, కండ్లపల్లి చెరువు, లింగంపల్లి చెరువు, ముప్పారపు చెరువు ఉన్నాయి. వీటితోపాటు చల్‌గల్‌లో పెద్ద చెరువు, పొలాసలో కొత్తకుంట చెరువులు ప్రధానమైనవి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని చెరువుల కట్టలు కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. కట్టలకు గండ్లుపడితే జిల్లాకేంద్రాన్నే ముంచెత్తనున్నాయి. కండ్లపల్లి చెరువుకు ప్రమాదం జరిగితే నీరంతా పట్టణంలోకే చేరుతాయి. మోతె, కండ్లపల్లి, ముప్పారపు చెరువుల చుట్టూ అనేక ఇళ్ల నిర్మాణాలున్నాయి. ఆ చెరువు కట్టలు పగుళ్లు పారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పొంచి ఉన్న ముప్పు:
జిల్లాకేంద్రంలోని చింతకుంట నుంచి కండ్లపల్లి చెరువు, ధరూర్, మోతె చెరువు మధ్య నిర్మించిన గొలుసుకట్టు కాలువల్లో చెట్లు విపరీతంగా పెరిగాయి. కాలువ ద్వారా నీరు ప్రవహించే పరిస్థితే కన్పించడం లేదు. ఇటీవల చింతకుంట చెరువును కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కాలువ కూడా కబ్జా కావడంతో కుచించుకుపోయింది. ఒకవేళ నీటి ప్రవాహం పెరిగితే కాలువద్వారా కాకుండా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కట్టలు పూర్తిగా పగుళ్లుబారడం కలవరపెడుతోంది. కాలువల్లో పూడిక తీయకపోవడం, చెరువు కట్టలకు మరమ్మతు చేయించకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఎస్సారెస్పీ అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు.
మరమ్మతు ఎప్పుడో..?
చెరువుల మరమ్మతుకు ఎస్సారెస్పీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మోతె పెద్ద చెరువుకు రూ.288 లక్షలు, ధర్మసముద్రం చెరువుకు రూ.121.20 లక్షలు, చల్‌గల్ పెద్ద చెరువుకు రూ.54.20 లక్షలు, పొలాస కొత్తకుంట చెరువుకు రూ.14.89 లక్షలు, ముప్పారపు చెరువుకు రూ.101 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా.. నిధులు మంజూరుకాకపోవడం గమనార్హం.
రైతుల్లోనూ కలవరం
చెరువు కట్టలు కుంగిపోవడంతో ఆయకట్టు రైతుల్లో నూ ఆందోళన నెలకొంది. పగుళ్లు చూపిన కట్టలకు గండిపడితే తమ పంటలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంగపుత్రుల ఫిర్యాదు మేరకు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కండ్లపల్లి చెరువు కట్టను పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని క్వాలిటీ కంట్రోలర్, కన్‌స్ట్రక్షన్స్ ఎస్‌ఈతో మాట్లాడారు. కండ్లపల్లి చెరువు కట్టకు మరో రూ.27 లక్షలు మంజూరయ్యాయని పనులు అలసత్వం వద్దని సూచించారు.
పట్టణం చుట్టూ నాలుగు చెరువులు
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
ఎప్పుడేం జరుగుతుందోనని భయంభయం
జిల్లాకేంద్రం వాసులకు పొంచి ఉన్న ప్రమాదం
చెరువుల మరమ్మతుకు నిధుల ప్రతిపాదన ఇలా..
మోతె పెద్ద చెరువు : రూ.288 లక్షలు
ధర్మసముద్రం చెరువు: రూ. 121.20 లక్షలు
చల్‌గల్ పెద్ద చెరువు : రూ.54.20 లక్షలు
పొలాస కొత్తకుంట చెరువు : రూ.14.89 లక్షలు
ముప్పారపు చెరువు : 101 లక్షలు