
లేబర్ కార్డుల దందా
ఒక కార్డుకు రూ.రెండువేల వరకు వసూలు కార్మికులకు బ్రోకర్ల బెడద అవగాహన లేక అందని సంక్షేమ పథకాలు
ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాలి
జగిత్యాల: కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో లేబర్‌కార్డు ఉన్నవారికే పథకాలు వర్తిస్తాయి. కాగా, కొందరు బ్రోకర్లు కార్డు ఇప్పిస్తామంటూ కార్మికుల నుంచి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేని కార్మికులకు సైతం కార్డులు అందజేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కార్యాలయంలో బ్రోకర్లే హవా
జిల్లాలో భవన నిర్మాణ, ఇతర రంగాల్లో సుమారు 2 లక్షల మంది కార్మికులుంటారని అంచనా. వీరికి పథకాలు, ఇన్సూరెన్స్ తదితరాలు వర్తించాలంటే లేబర్‌కార్డు తప్పనిసరి. అయితే కొందరికి కార్డు ఎలా పొందాలో తెలియక బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. దీంతో బ్రోకర్లు వసూళ్ల దందాకు తెరలేపారు. ఒక కార్డుకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 2 లక్షల మంది కార్మికులున్నా ఇప్పటి వరకు దాదాపు 50 వేల కార్డులు మాత్రమే అందజేశారు. అవగాహన లేక చాలా మంది లేబర్ కార్డు పొందలేకపోతున్నారు. కార్మికుల కుటుంబంలో వివాహం, ప్రసవం వంటి క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేస్తే లేబర్‌కార్డు ఉంటేనే సుమారు రూ.30 వేల వరకు గ్రాంట్ వస్తోంది. ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.1.30 లక్షలు వస్తాయి. ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకున్న బ్రోకర్లు కార్మికుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. కాగా, లేబర్ కార్యాలయంలో కూడా ఆమ్యామ్యాలు లేనిదే పనిచేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఎక్కువగా బ్రోకర్లే దందా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పట్టింపులేని అధికారులు?
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్యాలయం అ ధికారులు పథకాలపై అవగాహన కల్పించాలి. కా నీ, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణ లున్నాయి. కార్మికులు మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసి లేబర్ కార్యాలయంలో సంప్రదిస్తే అధి కారులే కార్డు మంజూరు చేస్తారు. కానీ, వారికి తెలియక బ్రోకర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కార్మికులకు బ్రోకర్ల బెడద లేకుండా కార్డులు అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
కార్మికులు బ్రోకర్లను ఆశ్రయించవద్దు. కార్డుల కోసం, ఇతరత్ర పనుల కోసం నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులకు పథకాలు వర్తిస్తాయి. ఎవరినీ ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయానికే రావాలి.
– కాడం అనిల్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జగిత్యాల

లేబర్ కార్డుల దందా