
వ్యాధుల కాలం.. ట్యాంకులు అపరిశుభ్రం
గ్రామాల్లో కొరవడిన అధికారుల పర్యవేక్షణ నెలల తరబడి శుభ్రం చేయని వాటర్ ట్యాంకులు తాగునీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు
కథలాపూర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన రక్షిత మంచి నీటి ట్యాంకులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. క్రమం తప్పకుండా వాటిని పరిశుభ్రం చేసి ఆయా తేదీలను పట్టిక రూపంలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కొన్ని గ్రామాల్లో ట్యాంకులను నెలల తరబడిగా శుభ్రం చేయడం లేదు. పైపులైన్ లీకేజీలు, అపరిశుభ్ర పరిసరాలతో అధ్వానంగా తయారయ్యాయని ప్రజలు వాపోతున్నారు. అసలే వ్యాధుల కాలం.. ఆపై ట్యాంకులు అపరిశుభ్రంగా ఉంటే రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
385 గ్రామాలు.. 892 నీటి ట్యాంకులు
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 385 గ్రామపంచాయతీలు, 113 అనుబంధ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు 892 రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించారు. ఇదంతా బాగానే ఉన్నా ట్యాంకుల నిర్వహణను పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రజలకు శుద్ధ నీరు అందని ద్రాక్షలా మారింది. ట్యాంకులను నెలకు మూడుసార్లు శుభ్రం చేయించాల్సి ఉండగా.. ఎప్పుడో ఒకసారి శుభ్రం చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రజలు తాగేందుకు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ట్యాంకులను శుభ్రం చేయించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదని, గ్రామాల్లో తాము సరఫరాను మాత్రమే పర్యవేక్షిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. నీరు శుభ్రంగా రాకపోవడంతో ప్రజలు నెలకు రూ.100 నుంచి రూ.200వరకు చెల్లించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని అదునుగా తీసుకుంటున్న కొందరు గ్రామాల్లో విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్‌లు నెలకొల్పి వ్యాపారం జోరుగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంచాయతీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు చొరవ చూపి ట్యాంకులను వారానికి రెండుసార్లు శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యాధుల కాలం.. ట్యాంకులు అపరిశుభ్రం