
సరిపడా లేక.. ఆపదలో రాక
జగిత్యాల/సాక్షి,పెద్దపల్లి: అత్యవసర సమయంలో 108కి ఫోన్ చేస్తే ఆగమేఘాల్లో వచ్చి రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇది అంబులెన్స్ పని.. కానీ, కొన్ని సమయాల్లో అంబులెన్స్ కావాలని ఫోన్ చేస్తే గంట ఆగాలని అటునుంచి సమాధానం వస్తోంది. దీంతో చేసేది లేక బాధితులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం సరిపడా అంబులెన్స్ వాహనాలు లేకపోవడంతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించక కరీంనగర్‌కు రెఫర్ చేయడం. ఆపత్కాల సమయంలో అంబులెన్స్ సర్వీస్ కోసం ఫోన్ చేస్తే వెయిట్ చేయాలనే సమాధానం వస్తుందని బాధితులు వాపోతున్నారు. జాతీయ, రాజీవ్ రహదారిలో వాహనాల రద్దీ పెరగడంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. దీంతో అత్యవసర సేవలకు గిరాకీ బాగానే పెరిగింది. కాగా, ఏరియా హాస్పిటల్‌కు వచ్చే గర్భిణులు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన బాధితులను ఇతర ఆసుపత్రులకు (రెఫర్) పంపిస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, రెఫర్ రాయగానే సమస్య పెద్దదని రోగులు ఆందోళన చెందుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇక గర్భిణులను వాహనాల్లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారికి పురుడుపోయాల్సి వస్తోంది.
రెఫర్.. వాహనాల కొరత
ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆస్పత్రుల్లో సరిపడా అంబులెన్స్‌లు అందుబాటులో లేక రోగులు ఇబ్బందిపడుతున్నారు. ఆయా పట్టణాల్లోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో రాత్రి వేళ కేసులు వస్తే ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. కరీంనగర్‌కు ఎక్కువగా రెఫర్ చేస్తుండడంతో అంబులెన్స్‌ల కొరతతో ప్రమాదాల బారినపడిన క్షతగాత్రుల బాధ వర్ణనాతీతం. ఆపద సమయంలో ఆయా పట్టణ ప్రాంతాలు, గ్రామాల నుంచి అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే శ్రీకరీంనగర్‌లో ఉన్నాంశ్రీ అనే సమాధానం వస్తుండడంతో ఆ వాహనం వచ్చే వరకు బాధితులు వేచిచూడటం, లేదా ప్రైవేట్ వాహనాలకు ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో అత్యవసర వైద్యం కోసం ఆశ్రయించిన రోగులకు 108 అంబులెన్స్ సేవలు అందడం లేదు. ఈక్రమంలో వైద్యుల నిర్వాకంపై దృష్టిసారించడంతో పాటు, ప్రతి మండలానికి ఒక్క అంబులెన్స్ సర్వీసు ఉండేలా ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రోగుల బంధువులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిన అంబులెన్స్‌లు, ప్రస్తుతం ఉన్నవి
జిల్లా ఉండాల్సినవి ఉన్నవి
కరీంనగర్ 18 16
జగిత్యాల 18 15
సిరిసిల్ల 13 12
పెద్దపల్లి 14 08
‘ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మీద అంబులెన్స్‌లను ప్రారంభించి పెద్దపల్లి జిల్లాకు నాలుగు కొత్త వాహనాలను కేటాయించారు. జూలపల్లి, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాలకు కేటాయించగా, వాటిని జిల్లాకు తీసుకొచ్చి వారం రోజులు వినియోగించారు. కారణాలు ఏంటో కానీ, పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన నాలుగు అంబులెన్స్‌లను గజ్వేల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి రెండు అంబులెన్సులు అవసరం ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఒక్క అంబులెన్స్‌ను రాత్రివేళ రెఫర్ కేసులకు పంపిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయానికి వాహనాలు చేరుకోక బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.
‘ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేట గ్రామంలో ఓ విద్యార్థి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, అంబులెన్స్‌లో పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం కోసం అదే అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అయితే అదే రాత్రి లాలపల్లి గ్రామంలో ఓ మహిళ పురిటినొప్పులతో ఇబ్బందులు పడుతుంటే అంబులెన్స్ రావడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉంది’.