
వానరాల వీరవిహారం
ఆకలితో అలమటిస్తున్న కోతులు కొబ్బరి చిప్పలు, భక్తుల ప్రసాదాలే ఆహారం ఆహార నిధి ఏర్పాటు చేస్తేనే శాశ్వత పరిష్కారం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో వానరాలు ఆకలితో నకనకలాడుతున్నాయి. భక్తుల చేతుల్లోని ప్రసాదాలే వాటికి ఆహారం అవుతున్నాయి. మరోవైపు వానరాలతో కొండగట్టుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రసాదం కవర్లు మొదలు.. సంచులనూ లాక్కేందుకు ప్రయత్నం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాటి ఆకలి తీర్చేందుకు విరాళాల సేకరణ కోసం వానరాల ఆహారనిధి, ప్రత్యేక ఆహార కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
తీరని ఆకలి..
కొండగట్టులో వేల సంఖ్యలో వానరాలు ఉన్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతోపాటు కొంతమంది అరటిపండ్లు తీసుకొచ్చి అందిస్తున్నారు. దిగువ కొండగట్టులో.. ఘాట్ రోడ్డు వెంట భక్తులు అడపాదడపా పుట్నాలు, బియ్యం, వివిధ రకాల పండ్లు అందిస్తున్నా.. ఆ ఆహారం ఎటూ సరిపోవడం లేదు. దీంతో కోనేరు, ఆలయ పరిసరాల్లోని కొబ్బరి చిప్పలు తింటూ కాలం వెల్లదీస్తున్నాయి. అవి కూడా సరిపోకపోవడంతో భక్తులచేతుల్లోని లడ్డూ, ప్రసాదాలను లాక్కెళ్తున్నాయి. రోడ్డుపై గుంపులుగా చేరుతుండడంతో భక్తులు, వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఆలయానికి వెళ్లే దారిలో ఆకలి తీర్చుకుంటున్న వానరాలు, కోనేరు వద్ద కొబ్బరి చిప్ప తింటున్న వానరం

వానరాల వీరవిహారం