
ఆయిల్ పాం తోటల్లో ‘కామెరూనికస్’ కీటకాలు
కొడిమ్యాల: మండలంలోని కోనాపూర్‌లో సాగుచేస్తున్న ఆయిల్‌పాం తోటల్లో మంగళవారం ఉద్యానశాఖ, లోహియా కంపెనీ ఆధ్వర్యంలో పరాగ సంపర్కం కోసం ఉపయోగపడే ఎలైడోబియస్ కామెరూనికస్ కీటకాలను విడుదల చేశారు. జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగుచేస్తున్న ఆయిల్ పాం తోటలు ప్రస్తుతం మూడేళ్ల వయస్సుకు వచ్చాయని, అధిక దిగుబడి కోసం కీటకాలను విడుదల చేశామని, ఒకే మొక్కపై ఆడ, మగ పుష్పాలు పూస్తాయని, వాటిలో పరాగసంపర్కం జరిగి పిందెలుగా మారడానికి ఈ కీటకాలు పుప్పొడిని ఆడ పూల వద్దకు చేర్చుతాయని తెలిపారు. తద్వారా పిందెలో నాణ్యత పెరిగి ఆర్నెళ్లలో దిగుబడి చేతికి అందుతుందని తెలిపారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పాం గెలలకు ధర రూ.19400 ఉందన్నారు. మూడేళ్ల వయస్సున్న తోటల్లో కీటకాలను వదులుతామని లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్ తెలిపారు. కార్యక్రమంలో డీఏవో భాస్కర్, ఏవో పి.జ్యోతి, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, రైతులు పాల్గొన్నారు.