
మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయండి
మెట్‌పల్లి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. పంట కోతకు వచ్చి రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంతో మార్కెట్‌లో వ్యాపారులు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉంటే.. రూ.1800కు మించి చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో సకాలంలో కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో జరిగిన సభలో పంటలకు మంచి ధరలను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత దానిని విస్మరించిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్వింటాల్‌కు రూ.2800 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎలాల దశరథరెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, జేడీ.సుమన్, ఏలేటి చిన్నారెడ్డి, భాస్కర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజాగౌడ్ తదితరులున్నారు.