కథలాపూర్: ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందించాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించి చెప్తున్నా.. క్షేత్రస్థాయి అధికారుల, సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. ఏళ్ల క్రితమే మరణించిన వారి పేర్లు కూడా జాబితాలో కనిపించడం.. పలువురి పేర్లు తప్పుగా నమోదు కావడం.. కొందరికి రెండుచోట్లా ఓటు హక్కు ఉండడం సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఎలా ఉంటాయంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కథలాపూర్‌లో వెలుగులోకి..
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు తుది ఓటరు జాబితా విడుదల చేశారు. ఒక జెడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 37,724 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తయారుచేసిన ఓటరు జాబితాను రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించారు. వాటిని సదరు శాఖ అధికారులు ఎంపీటీసీ స్థానాల వారీగా ఒక జాబితా.. వార్డులవారీగా మరో జాబితా రూపొందించారు. వాటిని బీఎల్వోలతోపాటు పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు పరిశీలించాక తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. ఇంత వడబోసినా పలు గ్రామాల్లో మరణించిన వారి పేర్లు ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి గ్రామంలో 10 మంది వరకు మరణించినవారి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు దృష్టి సారించి మరణించినవారి పేర్లు తొలగించాలని, అర్హుల పేర్లు చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ వినోద్‌ను వివరణ కోరగా.. మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉంటే బీఎల్వోలతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికల సమయం వరకు తుది ఓటరు జాబితా తయారు చేయిస్తామన్నారు.