
మంచి ముహూర్తాలు లేవని..
మద్యం షాపులకు అరకొరగా దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చినవి ఏడు మాత్రమే.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు
జగిత్యాలక్రైం: మద్యం షాపులకు టెండర్ల గడువు ఈనెల 18తో ముగియనుంది. గత నెల 27 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ఇప్పటివరకు కేవలం ఏడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లాలోని మొత్తం 71 షాపులకు గతంలో కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ.. మంచి ముహూర్తాలు లేకపోవడంతో దరఖాస్తులు సమర్పించే వారు వెనుకంజ వేస్తున్నారు.
ఈనెల 8న భారీగా రానున్న దరఖాస్తులు
చాలారోజులుగా మంచి ముహూర్తాలు లేవు. ఈనెల 8న మంచి ముహూర్తం ఉండటంతో అదే రోజు మద్యంషాపులకు టెండర్లు వేసేందుకు దరఖాస్తుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో దరఖాస్తుకు రూ.2లక్షలు ఉండగా.. ప్రస్తుతం దానిని రూ.3 లక్షలకు పెంచారు. ఇది దరఖాస్తుదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. పైగా దరఖాస్తు ఫీజు వాపస్ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంపైనా తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
భారీగా ఏర్పాట్లు
మద్యంషాపులకు దరఖాస్తులు మందకొడిగా వస్తుండడం.. రానున్న రోజుల్లో భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఎకై ్సజ్ శాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సెలవులను రద్దు చేశారు. ప్రతి అధికారి తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండి దరఖాస్తుదారులకు సూచనలు, సలహాలు ఇస్తూ.. దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 18న చివరి రోజు కావడంతో క్యూలైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు ఈనెల 18నే దరఖాస్తులు సమర్పిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.