
రైతులకు స్వల్ప ఊరట
పంటలకు పెరిగిన ‘మద్దతు’ వరి క్వింటాల్‌కు రూ.69 పెంపు మొక్కజొన్నలకు రూ.175 అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు
జగిత్యాలఅగ్రికల్చర్: వివిధ పంటలకు కేంద్రప్రభుత్వం మద్దతు ధరను స్వల్పంగా పెంచింది. ఏటా మాదిరిగానే 22 రకాల పంటలకు ధరలు ప్రకటించింది. ఈ ధరలు ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచే రైతులకు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో జిల్లాలో అత్యధికంగా సాగు చేసే వరి, మొక్కజొన్న రైతులకు లబ్ధి చేకూరనుంది.
రూ.2,389కి చేరిన క్వింటాల్ ధాన్యం
మొన్నటివరకు వరి ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,320గా ఉంది. ప్రస్తుతం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.69 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన ఇకనుంచి రైతుకు రూ.2,389 అందనుంది. అలాగే కామన్ రకం రూ.2,300 నుంచి రూ.2,369కి పెరిగింది. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈసారి పురుగులు, తెగుళ్ల బెడద పెద్దగా లేకపోవడంతో సగటున ఎకరాకు 23 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా. ఈ మేరకు 71.30 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మొన్నటివరకు ఉన్న ధర రూ.2,320 ప్రకారం రైతులకు రూ.1,654కోట్లు వస్తే.. పెరిగిన ధర రూ.2,389 ప్రకారం రూ.1,703 కోట్లు రానున్నాయి. రైతులకు అదనంగా రూ.49 కోట్లు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
మొక్కజొన్నకు రూ.175 పెంపు
మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. క్కజొన్నను జిల్లాలో దాదాపు 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు సగటున కనీసం 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 8.75లక్షల క్వింటాళ్లు దిగుబడి రానుంది. మొన్నటివరకు క్వింటాల్‌కు రూ.2,225 ఉండగా.. ప్రస్తుతం రూ.175 పెంచి రూ.2400గా నిర్ణయించారు. ఓపెన్ మార్కెట్‌లో మొక్కజొన్నకు డిమాండ్ ఉండటంతో క్వింటాల్‌కు రూ.2600 నుంచి రూ.మూడువేల వరకు పలుకుతోంది. ఓపెన్‌మార్కెట్‌లో ధర లేనప్పుడు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. మద్దతు ధర చెల్లించడం ద్వారా రైతులకు లాభం జరిగే అవకాశం ఉంది. గతంలో జిల్లా మొక్కజొన్న రైతులకు రూ.194.68 కోట్ల వరకు రాగా.. ఈ ఏడాది పెరిగిన ధరలతో రూ.210.00 కోట్లు రానుంది. మొత్తంగా రైతులకు రూ.15.32కోట్ల లబ్ధి చేకూరనుంది.
గుడ్డిలో మెల్లగా..
పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో మద్దతు ధర పెంపు కొంతమేర ఊరట నిచ్చినా.. సాగు ఖర్చులకు అనుగుణంగా ధరలు పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించాల్సి ఉండగా.. కేంద్రం నామమాత్రంగా పెంచుతోందనే విమర్శలు ఉన్నాయి. మద్దతు ధరలను నిర్ణయించే కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతుల నుంచి సాగు ఖర్చుల వివరాలు తీసుకుంటే కొంత మేలు జరిగేది. గతంలో ఉన్న ధరలకే కొంత కలిపి ఇస్తుండటంతో సాగు ఖర్చులు, రైతులకు వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోతోంది. ఇవేవీ పట్టించుకోకుండా ధరల నిర్ణాయక కమిషన్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయడంతో రైతులకు అంతంతమాత్రంగానే లాభం చేకూరుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు రెట్టింపు ఆదాయం రావాల్సి ఉండగా.. కనీసం సాగు ఖర్చులు కూడా రావడం లేదు.