
‘టెట్’ టెన్షన్
జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎల్జిబిలిటి టెస్ట్ (టెట్) టెన్షన్ పట్టుకుంది. 2010కు ముందు ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు టెట్ రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వారిలో అలజడి మొదలైంది. దీనికి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీస్, ఇన్ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కాని పక్షంలో ఉద్యోగం వదులుకోవాల్సిందేనన్న భయాందోళన మొదలైంది. ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి అని చెప్పడంతో రెండేళ్లలో ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల సమయం ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి పదోన్నతి రావాలంటే టెట్ రాయాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేశారు. 2008 నుంచి డీఎస్సీ రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి ఉంది. అంతకుపూర్వమే ఎంపికై న ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత ఉండాల్సిందేనని నిబంధనలు రావడంతో ఉపాధ్యాయులు తర్జనభర్జన పడుతున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు జిల్లాలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సుమారు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు రెండు వేలకు పైగా ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సిన వారున్నారు. సీనియర్ ఉపాధ్యాయులు, చాలాకాలం నుంచి పాఠశాలలో బోధన చేస్తున్న వారు ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతల వంటి కారణాలతో ఈ పరీక్షలకు హాజరుకావడం ఇబ్బందేనని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. టెట్ అర్హతపై సడలింపులు, లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఎప్పుడో చదివిన ఉపాధ్యాయులు
2008 డీఎస్సీ నుంచి టెట్ తప్పనిసరి చేశారు. అప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు టెట్‌లో అర్హత సాధించి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. కానీ.. ఎప్పుడో ఉపాధ్యాయులుగా చేరిన వారికి ఇప్పుడు టెట్ రాయాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. టెట్‌లో అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ఉదాహరణకు మ్యాథ్స్ ఉపాధ్యాయుడు టెట్ రాయాలంటే అతనికి అన్ని సబ్జెక్ట్‌లపై అవగాహన ఉండాలి. టెట్‌లో అర్హత సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.