
స్థానిక పోరుకు సై
జగిత్యాలరూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం దశలవారీగా కార్యాచరణ పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీ ఓటర్ల గుర్తింపు కూడా శుక్రవారం పూర్తి చేసింది. జిల్లాలో పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఏపీవోలకు కూడా శిక్షణ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 385 పంచాయతీల్లో 3,536 వార్డుల్లో విభజన పూర్తి చేసి నివేదిక అందజేశారు. జిల్లావ్యాప్తంగా 3,536 వార్డుల ఎన్నికల కోసం 3,536 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 216 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1,123 పోలింగ్ బూత్‌లను కూడా ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్‌కు అప్పగించింది. ఇప్పటికే జి ల్లాస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కూడా రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే.. రిజర్వేషన్లను జిల్లాస్థాయిలో అధికారులు ప్రకటిస్తారు.
ఆ వార్డులో ఓటర్లు 35 మందే..
బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయి పంచాయతీలో వార్డుకు 35 మంది ఓటర్లుండగా.. అతి పెద్ద వార్డుగా మల్యాల పంచాయతీలో ప్రతీ వార్డుకు 640 మంది ఓటర్లున్నారు. ఎంపీటీసీ అతి పెద్ద స్థానం బుగ్గారంలో 4,855 మంది ఓటర్లుండగా.. అతి చిన్న స్థానం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్–2 ఎంపీటీసీ స్థానం 1,293 మంది ఓటర్లున్నారు. 385 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా.. 3,536 వార్డులను గుర్తించి ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్ బూత్‌ను ఎంపిక చేశారు.
50 శాతం రిజర్వేషన్
గతంలో మాదిరిగానే జిల్లాలో జరగనున్న పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కోటాలకు కూడా మహిళల రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ స్టేషన్ల ఎంపిక, బీసీ ఓటర్ల గుర్తింపు పూర్తి కావడంతో ఆయా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాస్థాయిలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగానే జిల్లాలో రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. గ్రామాల్లో ఇప్పటినుంచే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేడి రాజుకుంది. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లపై పార్టీల నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. రిజర్వేషన్ అనుకున్న ప్రకారం ఏ వ్యక్తిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో పడ్డారు.