
‘కడారి’.. ఉద్యమమే ఊపిరి
‘కోస’తో ఎల్లారెడ్డిపేటకు అనుబంధం
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ సాధు ఉద్యమమే ఊపిరిగా జీవితాన్ని ప్రజలకోసమే పణంగా పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి కిష్టారెడ్డి–అన్నమ్మ చిన్న కొడుకు సత్యనారాయణరెడ్డి. 1980లో ఉద్యోగాన్ని వదిలి ఉద్యమబాటలో సాగిన ఆయన ఇంటివైపు కన్నెత్తి చూడకుండా నాలుగున్నర దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు.
గోపాల్‌రావుపల్లె నుంచి ఛత్తీస్‌ఘడ్ వరకు..
సత్యనారాయణరెడ్డి తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఆయన పనిచేసిన ఎల్లారెడ్డిపేటలోనే చదువు సాగింది. ఆటలు, చదువులో చురుకుగా ఉండేవాడు. పెద్దపల్లి జిల్లాలో చదువు పూర్తి కావడంతో ఉద్యోగం సాధించిన సత్యనారాయణరెడ్డి అక్కడ జరిగిన కార్మిక సంఘాల గొడవల్లో జైలుపాలు కావడంతో వామపక్ష ఉద్యమాలవైపు వెళ్లాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని సిరోంచా, గడ్చిరోలీ ప్రాంతాల్లో ఆర్గనైజర్‌గా అప్పటి పీపుల్స్‌వార్ దళనాయకుడిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పొలిట్ బ్యూరోలో 26 మంది సభ్యులు ఉండగా వారిలో ఒకరిగా కోస ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రజలకోసం త్యాగం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు. అనారోగ్యంతో ఉన్నా కూడా అడవిబాట విడవకుండా దండకారణ్యంలో ప్రజాయుద్ధాన్ని కొనసాగించారు.
ఛత్తీస్‌గఢ్ బయల్దేరిన కుటుంబ సభ్యులు
నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సత్యనారాయణరెడ్డి మృతదేహం కోసం అతడి సోదరుడు కరుణాకర్‌రెడ్డి, సమీప బంధువులు మంగళవారం ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరారు. పోస్టుమార్టం అనంతరం కోస మృతదేహాన్ని స్వగ్రామం గోపాల్‌రావుపల్లెకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
పోరుబాటలో అసువులు బాసిన సత్యనారాయణరెడ్డి
గోపాల్‌రావుపల్లె నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు
45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి(కోస)కి ఎల్లారెడ్డిపేట మండలంతో విడదీయరాని అనుబంధం ఉంది. సత్యనారాయణరెడ్డి తండ్రి కడారి కిష్టారెడ్డి గణిత ఉపాధ్యాయుడిగా మండల కేంద్రంలోని పెద్దబడిలో 1976 వరకు పనిచేశారు. ఆ సమయంలో చిన్నవయసులో ఉన్న సత్యనారాయణరెడ్డి ఇక్కడే చదువుకున్నారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పెద్దబడిలో చదువుకున్నారు. నారాయణపూర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సత్యనారాయణరెడ్డి చనిపోయాడన్న వార్త ఎల్లారెడ్డిపేటలో కలకలం రేపింది. ఆ సమయంలో పెద్దబడిలో చదువుకున్న విద్యార్థులు కోసతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వారిని కదిలించగా.. విద్యార్థి వయసు నుంచే సోషలిస్ట్ భావాలు ఉండేవని, సమాజంలోని అన్యాయాలపై ప్రశ్నించేవారని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ సమసమాజం, పేదల బతుకులపై మాట్లాడేవారని తెలిపారు. తమతో చదువుకున్న విద్యార్థి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి, ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంపై వారు భావోద్వేగానికి గురయ్యారు.