
బెడ్లు లేక రోగులు విలవిల
ధర్మపురి: వివిధ సమస్యలతో బాధపడుతు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా బెడ్లు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి గతంలో 30పడకలుగా ఉండేది. వైద్య విధాన పరిషత్‌లోకి మారడంతో 50 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. కానీ.. ఇది పేరుకు మాత్రమే. కేవలం పది బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విషజ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు. బుధవారం 184 మంది ఓపీ వచ్చారు. వీరిలో వివిధ వ్యాధులో బాధపడుతున్నవారిని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. అయితే ఒక్కో బెడుపై ఇద్దరు చొప్పున ఉంచి వైద్య సేవలందించారు. రోగి వెంట వచ్చి సహాయకులు ఆస్పత్రిలో స్థలం లేక బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆస్పత్రిని సందర్శించి రోగులకు సరిపడా వసతులు కల్పించాలని వైద్యాఽధికారులకు సూచించారు. అయినప్పటికీ అదనపు వసతులు కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తే.. బెడ్లు లేకుండాపోయాయని రోగులు ఆవేదనం వ్యక్తం చేశారు. ఈ విషయమై వైద్యాధికారి రవిని వివరణ కోరగా ప్రస్తుతం ఆస్పత్రి పైఅంతస్తు పనులు పూర్తికాకపోవడంతో బెడ్లు ఉపయోగించడం లేదన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఎనిమిది బెడ్లు జనరల్ వార్డులో, మూడు ఎమర్జెన్సీ, 15 పోస్ట్ ఆపరేటర్ వార్డులో, 10 ఐసీయూలో ఉన్నాయని, పరిస్థితులను బట్టి వినియోగించుకుంటున్నామని తెలిపారు.