
సాదాసీదాకు చాన్స్
సాదాబైనామాలపై రైతుల ఆశలు 2020లో దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం క్షేత్రస్థాయిలో విచారణ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేత
జగిత్యాల: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు జిల్లా రైతులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. హైకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో సాదాబైనామాలు క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తేవడంతో సాదాబైనామాల విధివిధానాలపై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, 2020లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఆయా భూములకు హక్కులు కల్పిస్తూ 13 బీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తదనంతరం వచ్చిన వారికి అవకాశం దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి.
ఏళ్ల తరబడి ఎదురుచూపులు
సాదాబైనామాలతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతులు పంటలు సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుబంధు, రైతుబీమా.. ఏది కావాలన్నా పట్టాదారు పాస్‌బుక్ కావాల్సి ఉంటుంది. తెల్లకాగితంపై కొనుగోలు చేశాక రిజిస్ట్రేషన్ కాకపోవడంతో మోకాపై ఉన్నా.. విక్రయించిన వారే రైతుబంధుతో పాటు అన్ని ఫలితాలు పొందుతున్నారు. తమకూ ప్రభుత్వ ఫలాలు అందించాలని సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లే కుండా పోయింది. తాజాగా కాంగ్రెస్ ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి వెసులుబాటు కల్పించింది. సాదాబైనామాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సైతం సూచించడంతో కొద్దిమేర రైతుల్లో ఆశలు పెరిగాయి.
రెవెన్యూ సదస్సుల్లో 9,090 దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూ భారతి పకడ్బందీగా అమలు చేయాలని, సాదాబైనామాలకు సైతం మోక్షం కల్పించారు. ప్రతి సమస్యపై రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ సదస్సుల్లో జిల్లావ్యాప్తంగా సాదాబైనామాలపై 9,090 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత 2020 వరకే కటాఫ్ ఇవ్వడంతో, అక్కడి వరకు వచ్చిన సాదాబైనామా దరఖాస్తులే పరిష్కరించనున్నట్లు తెలిసింది.
విచారణ షురూ..
సాదాబైనామాల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆర్డీవోస్థాయిలో విచారించనున్నారు. ప్రతి రైతుకు నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారించిన అనంతరమే పట్టాలు అందించనున్నారు. ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, అన్ని పూర్తిస్తాయిలో తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో చేపట్టనున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సాదాబైనామాల ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సాదాబైనామాల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.
జిల్లా వివరాలు
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన
సాదాబైనామా దరఖాస్తులు : 9,090
2020లో మీసేవలో వచ్చిన
దరఖాస్తులు : 37,730
మొత్తం దరఖాస్తులు : 46,820
మార్గదర్శకాల ప్రకారం
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే సాదాబైనామాల దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చిన దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపిన అనంతరమే చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులు దీనిపై సంసిద్ధంగా ఉన్నారు. – లత, అదనపు కలెక్టర్

సాదాసీదాకు చాన్స్